logo
జాతీయం

క్లైమాక్స్‌లో కన్నడి వార్‌... ఓటరు నాడి ఏం చెబుతోంది?

క్లైమాక్స్‌లో కన్నడి వార్‌... ఓటరు నాడి ఏం చెబుతోంది?
X
Highlights

కన్నడ సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. గెలుపు మాదంటే మాదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. కింగ్ మేకర్ ...

కన్నడ సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. గెలుపు మాదంటే మాదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. కింగ్ మేకర్ మేమే అనే ధీమా జేడిఎస్ లో కనిపిస్తోంది. అసలు కన్నడ నాడిని డిసైడ్ చేసేది తామేనంటున్నారు తెలుగు ఓటర్లు.2019 ఎన్నికల పల్స్ గా భావిస్తున్న కర్ణాటకలో గెలుపెవరిది? ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..

కర్ణాటకలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. మరో మూడు రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం జాతీయ పార్టీలు చెమటలు కక్కుతూ ప్రచారం చేస్తుంటే.. ప్రాంతీయ పార్టీలు తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడదన్న ఆత్మ విశ్వాసంతో అడుగులేస్తున్నాయి. పోలింగ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ పార్టీల విమర్శల హీట్ పెరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే.. తానే ప్రధానినవుతానంటూ రాహుల్ చేసిన ప్రకటనప్రచారాన్ని పతాక స్థాయికి చేర్చింది.

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ కు అనివార్యం.. ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆపార్టీకి అత్యవసరం.. అందుకే బిజెపి పై కాంగ్రెస్ దూకుడు పెంచింది. అనారోగ్యంతో కొంత కాలంగా బయటకు రాని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా సైతం ఈ సారి ప్రచారానికి విచ్చేశారు.. సిద్దరామయ్య టీమ్ గెలుపుకోసం కాంగ్రెస్ వేయాల్సిన ఎత్తుగడలన్నింటినీ వేస్తోంది. మరోవైపు దక్షిణాదిన కాలు పెట్టాలనుకుంటున్న బిజెపికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష లా మారాయి.. ఒక్క కర్ణాటక కోసం మోడీ, అమిత్ షాలతో పాటూ యూపి సిఎం యోగీ లాంటి బిజెపి మహారథులందరూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పీకేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని యడ్యూరప్ప సిఎం అవడం ఖాయమనీ బిజెపి ప్రకటనలు గుప్పిస్తోంది. ప్రతి పదిమంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని పెట్టి బిజెపి తమ ఓటు బ్యాంకును పక్కా చేసుకోడమేకాదు.. తటస్థ ఓటర్లపైనా దృష్టి పెడుతోంది.

జాతీయ పార్టీలు రెండూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రాంతీయ పార్టీలు మాత్రం కింగ్ మేకర్ రోల్ తమదేనన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నాయి ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశాలు లేవని కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందని అప్పుడు తామే కీలకమవు తామని జెడిఎస్ నేత కుమార స్వామి అంచనా. ధనబలం,కులబలం బాగా ప్రభావితం చేసే కర్ణాటకలో అన్ని పార్టీలు కీలకమైన ఒక్కళిగ, లింగాయత్ కులాల వారికే ఎక్కువ సీట్లు ఇచ్చాయి. కర్ణాటక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ఇతర సామాజిక వర్గాల ఓట్లు కీలకంగా మారాయి.అందుకే తాము గెలిస్తే లింగాయత్ లకు మైనారిటీ మతం హోదా ఇస్తామని సిఎం సిద్దరామయ్య ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు కర్ణాటకలో తెలుగు వారి ఓట్లూ కీలకమే.. అక్కడ 15 శాతం వరకూ తెలుగు ఓటర్లున్నారు. కన్నడ, ఉర్దూ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగే. ఈ నేపధ్యంలో 40 నుంచి 50 స్థానాల్లో తెలుగు వారి ఓట్లే కీలకంగా మారబోతున్నాయి.
బిజెపి వ్యవహారశైలితో విసిగిపోయి ఉన్న రాష్ట్రాలన్నీ కర్ణాటక ఎన్నికల పరిణామాలను ఆసక్తిగా చూస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని అర్ధించి భంగపడిన టిఆరెస్ కర్ణాటకలో బిజెపి ఓటమిని కోరుకుంటోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవేగౌడతో సమావేశమైన కేసిఆర్ అక్కడున్న తెలుగువారిని జేడిఎస్ కు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా రోజులనుంచే కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక హోదా ఇస్తామని చెప్పి నమ్మించి మోసగించిన బిజెపి పై ఏపి ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.. అక్కడి ఏపి ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక తెలుగు ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఏపి సిఎం చంద్రబాబు కూడా పిలుపునిచ్చారు.. టిడిపి నేతలు,ఎన్జీఓ సంఘాలు కూడా కర్ణాటక వెళ్లి తెలుగు ఓటర్లున్న ప్రాంతాల్లో బిజెపి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. వీరందరి ప్రభావం ఫలిస్తే.. బిజెపికి ఈ ఎన్నికలు అంత సులభం కాబోవు.. బిజెపి పతనం కోరుకుంటున్న వారంతా ఈ ఎన్నికలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందుకే కర్ణాటకలో గెలుపువరిది? కమలం వికసిస్తుందా? కాంగ్రెస్ హవా నిలుపుకుంటుందా?ఏం జరగబోతోంది?

Next Story