Top
logo

దసర పండుగ శుభాకాంక్షలు.. దసరా వేడుకలు

Highlights

దేశ వ్యాప్తంగా దసర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చిన్నా పెద్దా అందరూ కలిసి భక్తిప్రపత్తులతో పండగను ...

దేశ వ్యాప్తంగా దసర సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు చిన్నా పెద్దా అందరూ కలిసి భక్తిప్రపత్తులతో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.

దసరా సంబరాల పండగ. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పండుగంటే తెగ సంబరపడతారు. సకల శుభాలను కలుగ చేసే దుర్గమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలవడమే కాదు. ఆచారాలనూ పాటిస్తుంటారు. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పురాతనంగా వాడుకలో ఉన్న కొన్ని సంప్రదాయాలను ఓసారి చూద్దాం..

దసరా అనగానే అందరికీ సంబరమే.. శరత్కాలంలో వచ్చే ఈ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సీజన్ పరంగా వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేందుకు వీలుగా మన ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. అంతేకాదు.. కొత్త బట్టలు, పిండివంటలు ప్రతీ ఇంటిలోనూ ఉండేవే.. ముంగిట ముందు రంగవల్లులు తీర్చడమే కాదు.. ఏ ఇంట చూసినా.. లలితా సహస్ర నామ పారాయణ మారుమోగుతుంటుంది. నవరాత్రుల్లో అత్యంత విశేషమైన అలంకారంగా లలితాదేవిని చెప్పుకుంటారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదోరోజు విజయదశమి కలసి దసరా అంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదిశక్తిని తొమ్మిది రోజుల పాటు శరణంటూ కొలిచే నవరాత్రుల్ని.., శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చిందంటారు.

అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం రోజు ఆదిశక్తి సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. చదువుల మాతను కొలిస్తే విద్యాబుద్దులు అబ్బుతాయని ప్రతీతి. నవరాత్రుల్లో అమ్మవారిని కొలిస్తే కోరిన తలంపులు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో విధంగా అలంకారిస్తారు. విజయదశమికి పురాణాల్లో విశిష్ట నేపథ్యం ఉంది. విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలవడమే కాక జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి వధించినట్లు పురాణాలు చెబుతాయి. ఈ విజయాలను గుర్తు చేసుకుంటూ ఆదిపరాశ్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

తెలంగాణ జిల్లాల్లో దసరా:
ఇక తెలంగాణ జిల్లాల్లో దసరా రోజుల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

బతుకమ్మ...... దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ అంతట కనువిందుచేస్తాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో గౌరిదేవిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు స్త్రీలంతా ఆడిపాడి అమ్మవారిని కొలుస్తారు. వేడుకల చివరి రోజు బతుకమ్మను నిమజ్జనం చేసి పండుగ చేసుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగలో వయోభేదం లేకుండా స్త్రీలంతా ఉత్సాహంగా పాల్గొంటారు.

పుట్టింటికి చేరుకునే ఆడపడుచులు ప్రతిరోజు చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసి సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు తంగేడి, గునుగ పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో పేరుస్తారు, ఆపై తంగేడు పూలకు రంగులు అద్ది వాటిని అందంగా పేరుస్తారు. పూల మధ్య అందుబాటులో ఉండే అన్ని రకాల పూలు అందంగా అలంకరిస్తారు. పూలను అందంగా పేర్చాక వాటిపై పసుపుతో చేసిన గౌరిదేవిని పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధించాక వాటిని నిమజ్జనం చేస్తారు.

ఇక బొమ్మల కొలువు మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగం.. ముఖ్యంగా దసరా వేడుకలప్పుడు జరిపే ఈ బొమ్మల కొలువు పండగ కోసం ఏడాదంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు చిన్నారులు.. ఉత్తరాంధ్రలో మాత్రమే కనిపించే ఈ వేడుక ఆ ప్రాంత వాసుల వైశిష్ట్యానికి నిదర్శనం..

మన జీవన విధానం ఎంత ఆధునికంగా మారిపోయినా కొన్ని సనాతన సంప్రదాయాలను మాత్రం వదలకుండా తరతరాలుగా పాటిస్తున్న వారున్నారు. బొమ్మల కొలువు అంటే కేవలం బొమ్మలు పేర్చడం కాదని, వినోదమే పరమార్ధం కానది అందులో ప్రత్యేకత ఉందని అంటున్నారు నిర్వాహకులు.

రాయలసీమలో:
ఇక రాయలసీమ మారుమూలల్లో దసరా పండగ వెరైటీగా జరుగుతుంది. దసరా అనగానే కర్నూలులోని దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం.. కర్రలతో కొట్టుకుని రక్తం చిందిస్తే దేవుడు శాంతించి తమ కోర్కెలు తీర్చుతాడని అనాదిగా అక్కడి భక్తులు నమ్ముతారు.

కర్నూలు జిల్లా దేవరగట్టులో విజయదశమి సందర్భంగా మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భక్తులు కర్రలతో కొట్టుకుంటూ దేవుడి ఊరేగింపులో పాల్గొంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమని దీనిని వదులుకోలేమని భక్తులు చెబుతున్నారు.

అధికారులు, ప్రజా సంఘాలు ఎన్ని ముందస్తు చర్యలు, చర్చలు, అవగాహనా సదస్సులు చేపట్టిన షరామాములుగా గ్రామస్తులు బన్ని ఉత్సవంలో కర్రలతో పాల్గొని రక్తం చిందిస్తారు. పోలీసులు, అధికారుల సాక్షిగా భక్తులు కర్రలతో కొట్టుకుంటారు.

సహజ సిద్ధ ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైన నెరణికి దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా వచ్చిందంటే చాలు సందడే సందడి. ఆలూరుకు 15 కిలోమీటర్ల దూరంలో పచ్చటి కొండల మధ్య వెలసిన దేవరగట్టు క్షేత్రం జిల్లాలో తెలియని వారు అరుదు. దసరా ఉత్సవాలంటే ముందుగా దేవరగట్టే గుర్తుకొస్తుంది. బన్ని రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరం గతంలోనే దేశవ్యాప్త చర్చకు తెర తీసింది. అర్ధరాత్రి కాగడాల వెలుతురులో దేవుడిని తమ ఊరికి తరలించేందుకు చుట్టుపక్కల గ్రామాలు యధాశక్తి పోరాడతాయి. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది దేవరగట్టుకు తరలివస్తారు.

మాల మల్లేశ్వర స్వామి ఎత్తయిన కొండ గుహల మధ్య వెలిశారు. తొలినాళ్లలో కూర్మావతారంలో ఉన్న స్వామి మూల విరాట్ కు పూజలు జరిపేవారు. కాలక్రమేణా మాల మల్లేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే దాదాపు 500 మెట్లు ఎక్కాలి. ఇంతకుముందు మట్టి కొండ ఎగబాకాల్సి వచ్చేది. ఆలయ కమిటీ ఏర్పడిన తర్వాత మెట్ల మార్గం నిర్మించారు. చుట్టూ పచ్చటి చెట్లు, కొండలు చూపరులను అబ్బురపరుస్తాయి.

ఈ ఆలయానికున్న పురాణ గాథలోకి వెడితే మణి, మల్లాశురులనే రాక్షసులు, మునులు, మహర్షులు చేపట్టే యజ్ఞాలు, యాగాలు, హోమాలను భగ్నం చేసేవారట. రాక్షసుల బారి నుంచి రక్షణ కల్పించడానికి పరమ శివుడు మాల మల్లేశ్వర స్వామి అవతారమెత్తారనేది పురాణ కథనం. శివుడి సమ్మతి మేరకే రక్తదానం చేయడానికి ప్రతి దసరాకు బన్ని ఉత్సవాలు జరుపుతారని పూజారులు చెబుతారు. మూల విరాట్ ను కులదైవంగా భావించే గొరవయ్యలు శివుడు ఆజ్ఞ మేరకు నాటి నుంచి రక్తం బలిదానం చేస్తుండటం సంప్రదాయం. ఇక ఉత్సవం విషయానికొస్తే ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ముళ్లపడి చేరి పూజలు చేస్తారు. మాల మల్లేశ్వరుని ప్రియభక్తుడు గొరవయ్య రాక్షసులు కోరిక మేరకు కాలి తొడ భాగంలో కత్తితో కోసి పిడికెడు రక్తం ధారపోస్తాడు. అనంతరం బసవన్న ఆలయం చేరుకుని భవిష్య వాణి వినిపిస్తారు. అక్కడినుంచి జైత్ర యాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో బన్ని విజయకేతనంతో చేతిలో కర్ర, కాగడా పట్టి దేవుడి ముందు భక్తితో నృత్యం చేస్తారు. బన్ని జైత్రయాత్ర ఆచారమే తప్ప అనాగరికం కాదని అక్కడి వారు తేల్చి చెబుతున్నారు.

దేవరగట్టు మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ హిందూ దేవాలయాలతో పాటు మసీదులు, దర్గాలు వెలిశాయి. టిప్పు సుల్తాన్ కట్టించిన మసీదు ఆకర్షణగా నిలుస్తోంది. ఆపక్కనే విస్తరించిన దాదా అల్లా దర్గాను ఆధునీకరించారు. ప్రతి ఆదివారం దూర దూరాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేస్తారు. దేవరగట్టు ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం.. దీనిని పర్యాటకకేంద్రంగా ప్రకటించాలన్నది స్థానికుల అభిమతం.

కోనసీమలో:
రాయలసీమ లాంటిదే మరో ఆచారం అటు కోనసీమలోనూ ఉంది. అయితే అది ఇలా కర్రలతో కొట్టుకోవడం కాదు.. శతాబ్దాల క్రితం నుంచి అలవాటులో ఉన్న చేడి తాలింఖాన పేరుతో ఓ వీరకళను గుర్తు చేసుకోవడమే ఈ ఉత్సవం ప్రత్యేకత.

చూస్తుంటే తలలు తెగిపడతాయేమోనని భయపడేలా ఉన్న ఈ కళ పేరు చేడి తాలింఖాన.. ఇది తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో శతాబ్దాల నుంచి ఆచారంలో ఉన్న కళ.. నాగరికత ఎంతలా పెరిగినా, పురాతనంగా వస్తున్న ఆచారాలను కొనసాగించడానికే ఆ ఊరి ప్రజలు ఇష్టపడతారు. ప్రతీ ఏటా దసరా పండుగ సమయంలో ఈ వీర విద్యను ప్రదర్శిస్తారు.

బ్రిటీష్ కాలంలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన ఈ వీర కళకు 175 ఏళ్ల చరిత్ర ఉంది. అమలాపురం పట్టణంలోని కొంకపల్లి, మహీపాల వీధి, నల్లా వీధి,రవణం వీధి ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు వృద్ధులు వయోబేధం లేకుండా ఈ వీర కళను ప్రదర్శిస్తారు. దసరా పండుగకు నెలరోజులు ముందుగా ఈ వీర విద్యపై గురువుల దగ్గర శిక్షణ పొందుతారు. కర్రలు, కత్తులు, బల్లేలు, లేడి కొమ్ములు, అగ్గిబరాటాలతో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తారు.

కళ్లకు గంతలు కట్టుకుని పడుకున్న వ్యక్తి పొట్టపై కొబ్బరికాయను పెట్టి దానిని మధ్యకు పగలకొట్టడం అన్నది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీష‌ వారిని తరిమి కొట్టడానికి బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చెడి తాలింఖాన విద్యను అమలాపురంలో ప్రచారంలోకి తెచ్చినట్లు చెబుతారు. కేవలం దసరా సమయంలో మాత్రమే ప్రదర్శించే ఈ కళను చూసేందుకు చుట్టు పక్కల నుంచి వేలాదిగా జనం తరలి వస్తారు.

గ్రామాలలో పులివేషాలనే జానపద కళా ఆకర్షణీయం:

ఇక దసరా పండగ రోజు గ్రామాలలో పులివేషాలనే జానపద కళా ప్రదర్శన అత్యంత ఆకర్షణీయం. ఈ పులి వేషాలను దక్షిణ భారతదేశంలో పులివాలు కోలు అంటారు. పులివేషాలు, పెద్దపులి వేషాలు, దసరా పులివేషాలనీ తెలుగు రాష్ట్రాల్లో పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి, దీపావళి పులి వేషాలు ప్రదర్శిస్తారు. కానీ, తెలంగాణలో దసరా రోజు ఈ కళా ప్రదర్శన బక ఘనమైన వేడుక.

పులి వేషం వేసుకునేవారు తమ శరీరమంతా పసుపు రంగు వేసుకుని నల్లని చారలు చిత్రించుకుని తలకు పులి తల తొడుగును పెట్టుకుంటారు. నడుముకు లంగోటి కట్టుకుని బెల్టు పెట్టుకొంటారు. దానికి వెదురు బద్దలతో ఎటువంచుతే అటు వంగే అట్లుగా పులి తోకను తయారు చేసుకుని చూసేవారికి నిజమైన పులి లాగ కనిపిస్తారు. ఒకరు ఆ తోకను పట్టుకుంటే ఆ పులి మనిషి ఊరిలోకి వస్తాడు. వెనుక డప్పు చప్పుడుంటుంది.

పులి ఊరిలోకి వచ్చిందంటే పిల్లలకు, పెద్దలందరికీ ఎంతో పండగ. ఆ పులి, పులి రూపుదాల్చిన వ్యక్తి చేష్టలను నటిస్తూ వీధులన్నీ తిరుగుతాడు. కొన్ని ప్రాంతాలలో ఒక ఖాళీ స్థలంలో ఆకులు, కొమ్మలతో ఆరణ్యంలా అమర్చి ఉంచుతారు. ఆ పులి ఆరణ్యంలో జంతువులను వేటాడటానికి అటు ఇటూ తిరుగుతూ, ఒక్కొక్కసారి గాండ్రిస్తూ అక్కడ చూసేవారిపై దాడి చేస్తున్నట్లుగా నటిస్తూ భయపెడుతుంటుంది.

డప్పు వాయిద్యాలకు అనుగుణంగా పులి వేషగాళ్ళు జంగలు వేస్తూ చూసే వారికి ఉత్సాహం కలిగిస్తారు. ఈ పులిని వేటాడడానికి వేటగాడు వచ్చి, దానిని వేటాడి చంపడానికి ప్రయత్నిస్తే ఆ పులి అతనిమీదకు దుముకుతే, అతను తప్పించుకొని చివరకు దానిని వేటాడి చంపునట్లుగా నటిస్తాడు. దెబ్బతిన్న ఆ పులి కూడా ఆ వేటగానిపై దుమకడానికి ప్రయత్నించి చేతకాక చనిపోయినట్లుగా పడిపోతుంది. ఈ పులి వేషాల్ని చూసి భయపడి పోయే పిల్లలు ఎందరో.

Next Story