కమలం మిసైల్‌ తెలుగు రాష్ట్రాల్లో పేలుతుందా!!

కమలం మిసైల్‌ తెలుగు రాష్ట్రాల్లో పేలుతుందా!!
x
Highlights

ఉత్తరప్రదేశ్‌, తెలంగాణకు భౌగోళికంగానే కాదు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికంగానూ అనేక భిన్నత్వాలున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిరం ఉద్యమంతో, అక్కడ...

ఉత్తరప్రదేశ్‌, తెలంగాణకు భౌగోళికంగానే కాదు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికంగానూ అనేక భిన్నత్వాలున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిరం ఉద్యమంతో, అక్కడ హిందూత్వ నినాదం, జనం నరనరాల్లో జీర్ణించుకుపోయింది. మతమంటే, అక్కడి జనాలు విపరీతంగా అభిమానిస్తారన్న అభిప్రాయముంది. ముజఫర్‌ నగర్‌ అలర్లు, దాద్రీ ఘటనలతో పాటు నిత్యం జరిగే మతకల్లోలాలే అందుకు నిదర్శనం. ఆ వేడిలోనే బీజేపీ అక్కడ బలపడింది. ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నది ప్రతిఒక్కరూ అంగీకరించే విషయం. మరి పరిపూర్ణానంద ప్రయోగం సంగతేంటి?

యూపీ అసెంబ్లీ పోరులో యోగి ఆదిత్యనాథ్‌ను అసలు సీఎంగా అభ్యర్థిగా ప్రచారం చేయలేదు బీజేపీ. కాషాయ జెండా ఆ రేంజ్‌లో రెపరెపలాడుతుందని, అమిత్‌ షా కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే, అక్కడ ఎస్పీ, బీఎస్పీ బలమైన పక్షాలు. కానీ మోడీ వేవ్, అమిత్‌ షా సోషల్ ఇంజనీరింగ్‌ స్ట్రాటజీ బాగా పని చేసింది. ఎస్పీ, బీఎస్పీల పాలనపై జనాలకు విసుగొచ్చింది. ఆ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయడంతో, ఓట్లు చీలిపోయి, అంతిమంగా బీజేపీ అఖండ విజయానికి దోహదం చేసింది. కానీ తెలంగాణలో అలాంటి రాజకీయ శూన్యత కనిపిస్తోందా....టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కాదని, జనం మరో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారా?

తెలంగాణలో యూపీ తరహా రాజకీయ వాతావరణం లేదు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌ బలమైన పక్షంగా ఒకవైపు ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా పవర్‌‌ఫుల్‌గానే ఉంది. దీనికి తోడు చెక్కుచెదరని క్యాడర్‌ ఉన్న టీడీపీ, సీపీఐ, కొత్తగా టీజేఎస్‌లతో కాంగ్రెస్‌ కూటమి కట్టింది. ఈ పరిస్థితుల్లో సీపీఎం ఒంటరైతే, మరో ఒంటరి బీజేపీనే. టీడీపీ దూరం కావడంతో బీజేపీ చాలా ఆందోళనగా ఉంది. పోరాడితే పోయేదేమీ లేదనుకుంటున్న కాషాయదళం, అదే తెెగింపుతోనే స్వామిజీని రంగంలోకి దించి, హిందూ ఓట్ల సమీకరణకు వ్యూహాలు వేస్తోందని తెలుస్తోంది. హిందుత్వ ఎజెండా కాకుండా, అదే భుజానికెత్తుకున్న వారిని ఫేస్‌గా చేసి వెళ్తే బాగుంటుందన్న వ్యూహంతోనే పరిపూర్ణానందను బరిలోకి దించుతోంది.

అయితే, బీజేపీ ప్రయోగం వెనక మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, అంతిమంగా కాంగ్రెస్‌కు నష్టం కలిగించి, కేసీఆర్‌కు లాభం చేకూర్చాలనే లక్ష్యంతోనే, బీజేపీ వ్యూహాలు వస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను నిలువరిస్తే, నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, లోక్‌సభ పోరులోనూ, కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చని మోడీ, అమిత్‌ షా స్ట్రాటజీగా కొందరు విశ్లేషిస్తున్నారు. అదే ఆలోచనతోనే, వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిపోయే స్వామి పరిపూర్ణానందతో ప్రచారాన్ని హోరెత్తించి, వీలైతే సీఎం అభ్యర్థిగా ప్రకటించి, గణనీయమైన సంఖ్యలో హిందూ ఓట్లను ఆకర్షించాలని, కాషాయ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories