logo

పేరులో నేముంది... ఆ ఊరిలో ఏముంది!!

పేరులో నేముంది... ఆ ఊరిలో ఏముంది!!

రోమియో అండ్ జూలియట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. షేక్ స్పియర్ ప్రసిద్ధ రచన అది. అందులో వాట్స్ ఇన్ ఎ నేమ్ ? అనే డైలాగ్ ఉంటుంది. అక్కడి సమయ సందర్భాలు ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రం పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మరీ ముఖ్యంగా నగరాల పేర్లకు... శతాబ్దాల క్రితం నాటి పేర్లు ఇప్పుడు మళ్లీ వాడుకలోకి వస్తున్నాయి.నిజానికి ఈ ఆట ఇప్పటిదేమీ కాదు....బ్రిటిష్ హయాం నుంచీ కొనసాగుతూ వచ్చిన ఈ ఊరి పేర్ల ఆట....మారిపోతున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇప్పుడు తారస్థాయికి చేరుకుంటోంది. పేరులో ఏముంది ? అని ఒక వర్గం నిలదీస్తుంటే.... పేరులోనే ఎంతో ఉంది అంటూ మరో వర్గం బదులిస్తోంది. అసలు .....పేరులో ఏముందో....దాని కోసం ఎందుకింత రాద్ధాంతమవుతుందో ఇప్పుడు చూద్దాం.

నిజమే. భారతీయ దృష్టితో చూసినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మాటల్లో తప్పుబట్టేందుకేమీ లేదు. ఒక పేరుకు ఎందుకంత ప్రాధాన్యముంటుందో ఆయన తనదైన శైలిలో వివరించారు. పేరుకు గనుక ప్రాధాన్యం లేకుంటే.... రావణుడు, ధుర్యోధనుడు లాంటి పేర్లను ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. భారతీయ ఔన్నత్యాన్ని గుర్తుకు తెచ్చేలా అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చామని అన్నారు. ఎన్నడూ లేని విధంగా నవంబర్ నెల నామ మార్పిడి మాసం గా మారిపోయింది. మొన్ననే నవంబర్ 4న యూపీలో అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. నిజానికి ప్రయాగ పేరు కొత్తదేమీ కాదు. కొన్ని శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే. గంగా, యమున సంగమ స్థలంగా ప్రయాగ ప్రఖ్యాతి చెందింది. అసలు...... ప్రయాగ అంటేనే సంగమం. గంగా, యమునలే కాకుండా......అంతర్వాహినిగా సరస్వతి నది కూడా అక్కడే సంగమిస్తుందని అంటారు. అలా త్రివేణి సంగమంగా ప్రయాగ ప్రఖ్యాతి చెందింది. యావత్ ప్రపంచంలోనే ఒక సజీవ వారసత్వ అద్భుతంగా చెప్పే కుంభమేళా జరిగేది ప్రయాగ లోనే. 16వ శతాబ్దిలో అక్బర్ ఈ నగరంలో పేరు ను అలహాబాద్ గా మార్చారు. అలా మార్చినప్పటికీ, సంగమ స్థలం, కుంభమేళా జరిగే ప్రాంతం మాత్రం ప్రయాగ గానే వాడుకలో ఉంది. ఈ నగరానికి ఉన్న చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యం సాటిలేనిది. అందుకే ఈ నగరానికి తిరిగి శతాబ్దాల క్రితం నాటి పేరు పెడుతున్నట్లుగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లాంటి వారు మాత్రం ఈ పేరు మార్పుపై విమర్శలు చేశారు. నగరాల పేర్లు మారుస్తూ....తామేదో పని చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. వారి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈ పేరు మార్పిడిని ఆమోదించారు. శతాబ్దాలుగా అదే పేరు కొనసాగుతూ వచ్చిన నేపథ్యంలో పెద్దగా అభ్యంతరాలేవీ కూడా వ్యక్తం కాలేదు.

ఇక తాజాగా ఫైజాబాద్ జిల్లా పేరును శ్రీ అయోధ్య జిల్లాగా మార్చారు. ఈ మార్పు కూడా యూపీలోనే జరిగింది. ఈ మార్పు గురించి వారం రోజుల క్రితం నుంచే టీజర్లు వెలువడ్డాయి. యూపీ సీఎం ఒక కీలక ప్రకటన చేస్తారన్న వ్యాఖ్యలు వినవచ్చాయి. బహుశా అది రామజన్మభూమి అంశంపైనే ఉంటుందని అంతా భావించారు. వారి ఊహలకు భిన్నంగా..... శ్రీ అయోధ్య జిల్లా గురించి సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. అయితే ఇది కూడా పరోక్షంగా రామజన్మభూమి అంశంతో ముడిపడిందే. నిజానికి అయోధ్య, ఫైజాబాద్ జంటనగరాల్లాంటివి. ఫైజాబాద్ జిల్లా పేరు అయోధ్యగా మారిన నేపథ్యంలో కాలక్రమంలో ఫైజాబాద్ పేరు మసకబారనుంది. ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చాలని వీహెచ్ పీ కొన్నేళ్ళుగా డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్ ఇప్పుడు నెరవేరినట్లయింది. అయోధ్యకు ఉన్న చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే.... ఆ జిల్లాకు అయోధ్య పేరు సరైందేనని చెప్పవచ్చు. ఆ పేరు ప్రకటించేందుకు యోగి ఆదిత్యానాథ్ ఎంచుకున్న సందర్భం కూడా అలాంటిదే. దీపావళిని మించిన విశిష్టత మరొకటి లేదు. రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగివచ్చింది ఆనాడే అన్నది ప్రజల విశ్వాసం. అయోధ్యలో రామాలయం ఎన్నికల సందర్భంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అయోధ్య పేరు మార్పుతో బీజేపీ ఎంతో కొంత లబ్ధి పొందుతుందనడంలో సందేహం లేదు. అయితే....రామాలయ నిర్మాణ జాప్యంపై సంఘ్ పరివార్ లో పెరుగుతున్న ఆగ్రహాన్ని మాత్రం ఇది చల్లార్చలేకపోతోంది.

నగరాల పేర్లను మార్చడంలో యూపీ ప్రభుత్వాన్ని గుజరాత్ ఆదర్శంగా తీసుకున్నట్లుంది. అక్కడ అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చేందుకు తాము సిద్ధమేనంటూ గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ ప్రకటించారు. తగిన సమయంలో ఈ మార్పు ఉంటుందని అన్నారు. ప్రజలు కోరుకుంటే అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చేందుకు తాము సిద్ధమేనన్నారు. చారిత్రకంగా చూస్తే 11వ శతాబ్దిలోనే సబర్మతీ నదీతీరాన కర్ణావతి నగరం వెలిసింది. 1411లో సుల్తాన్ అహ్మద్ షా కర్ణావతి సమీపంలోనే మరో పట్టణాన్ని అహ్మదాబాద్ పేరిట నిర్మించారు. ఇక తాజాగా ఈ నగరం పేరు ను కర్ణావతిగా మార్చాలనడం వివాదాన్ని రేకెత్తించింది. ఈ చర్యను విపక్షం కాంగ్రెస్ ఎన్నికల గిమ్మిక్కుగా విమర్శించింది. బీజేపీ నేతలు మాత్రం అహ్మదాబాద్ పేరు మార్చే విషయంలో ముందుకెళ్ళేందుకే సిద్ధమంటున్నారు. పేరు మార్చినా....మార్చకపోయినా రాబోయే ఎన్నికల్లో ఇది అన్ని పార్టీలకూ ఒక ప్రచారాస్త్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top