Top
logo

ఎన్నికల వేళ... వేడెక్కుతున్న రాజకీయం.. ఓటుకు నోటు అదే ఊతం

ఎన్నికల వేళ... వేడెక్కుతున్న రాజకీయం.. ఓటుకు నోటు అదే ఊతం
X
Highlights

కర్ణాటక ఎన్నికలు సరికొత్త రాజకీయాలకు వేదికవుతున్నాయా? మూడేళ్ల క్రితం సాక్ష్యాల్లేవంటూ పక్కన పెట్టేసిన ఓటుకు...

కర్ణాటక ఎన్నికలు సరికొత్త రాజకీయాలకు వేదికవుతున్నాయా? మూడేళ్ల క్రితం సాక్ష్యాల్లేవంటూ పక్కన పెట్టేసిన ఓటుకు నోటు ఫైలుకు ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చిందా? చార్జిషీటులో చంద్రబాబు పేరు చేరితే ఇటు స్టింగ్ ఆపరేషన్ తుట్టా కదులుతుందా? ప్రత్యర్ధులను కార్నర్ చేసేందుకు కేసిఆర్ పాత కేసులను తవ్వి తీస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి..మూడేళ్లు స్తబ్దుగా ఉన్న పాత కేసులు ఇప్పుడు బయటకొస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. మూడేళ్ల క్రితం నాటి తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను డబ్బుతో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినందుకు రేవంత్ రెడ్డి సహా కొందరు టిడిపి నేతలపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి. స్టీఫెన్ సన్ కు లంచం ఇవ్వడానికి ముందు తమ అభ్యర్ధికి మద్దతు పలకాలంటూ చంద్రబాబు ఫోన్ లో స్టీఫెన్ తో మాట్లాడినట్లుగా వచ్చిన సంభాషణలు కలకలం రేపాయి.

ఈకేసుపై అప్పట్లో రెండు చార్జి షీట్లు కూడా దాఖలయ్యాయి. మొదటి చార్జి షీటులో ఈకుట్రకు రూపకల్పన చేసింది ఏపి సిఎం చంద్రబాబు నాయుడేనంటూ ... కనీసం22 సార్లు ఆయన పేరును ప్రస్తావించారు. అయితే, నిందితుల జాబితాలో మాత్రం పేరు చేర్చలేదు. ఇదే అంశంపై వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హై కోర్టు, సుప్రీం కోర్టులలో కేసులు వేశారు. స్వర నిర్ధారణకు ప్రపంచంలోనే పేరెన్నికగన్న అమెరికాలోని హెలిక్స్ సంస్థకు చంద్రబాబు స్వర నమూనాలు పంపి ఓటుకు నోటు కేసు ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమేనని తేల్చారు. కనుక ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చాలంటూ ఆళ్ల వాదించారు. మరోవైపు సుప్రీం కోర్టులో కేసు తుది విచారణకు చేరుకున్న దశలో నిందితుడుగా ఉన్న మత్తయ్య అప్రూవర్ గా మారడం కలకలం రేపుతోంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.

2015లో జరిగిన ఈ ఉదంతంపై అప్పట్లో ఇద్దరు సిఎంలు పరస్పరం విమర్శలు చేసుకున్నా కాలక్రమంలో ఈ కేసు ప్రస్తావన రాలేదు.. కానీ రెండు రోజులుగా సిఎం కేసిఆర్ ఈ కేసుపై న్యాయనిపుణులతోనూ, ఏసిబి ఉన్నతాధికారులతోనూ, డిజిపితోనూ గంటల తరబడి సమావేశమై సమీక్షించడం చూస్తుంటే.. ఏదో జరుగుతోందనే అనుమానాలు రేగుతున్నాయి. దీనికి తోడు రెండు రోజుల క్రితం కేసిఆర్ గవర్నర్ నరసింహన్ను కలవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు కర్ణాటక ఎన్నికల తర్వాత తనపై కక్ష సాధింపు చర్యలుంటాయంటూ చంద్రబాబు కూడా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ప్రజలే తనను కాపాడాలని కూడా ధర్మ పోరాట దీక్ష సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఏడాదిలో సిఎం కేసిఆర్ అవినీతి అక్రమాల కేసులను తవ్వి తీయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల జమానాలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ కేసుల్లోనూ ప్రధానంగా అప్పటి సిఎం చంద్రబాబు పరిపాలనపైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ భూముల అమ్మకాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోవడం వివాదానికి దారి తీసింది. పెండింగ్ లో ఉన్న ఈ అవినీతి ఆరోపణల కేసులను తవ్వి తీయాలని కేసిఆర్ నిర్ణయించారు. ఏసిబి, విజిలెన్స్, సిఐడి కేసుల తుట్ట కదిపి వాటిపై చర్యలెందుకు తీసుకోలేదో నిగ్గు తేల్చనున్నారు.

మూడేళ్లు మౌనంగా ఉన్న ఓటుకు నోటు కేసు ఇప్పుడు హటాత్తుగా తెరపైకి రావడం వెనక కేంద్రం హస్తముందా? లేక ఫెడరల్ ఫ్రంట్ వైపు చంద్రబాబును బలవంతంగా రప్పించడానికి కేసిఆర్ ఈ ఎత్తుగడలు వేస్తున్నారా? మొత్తం మీద ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా కేసిఆర్ చేపడుతున్న ఈ చర్యల వెనకున్నదెవరు? వాళ్ల టార్గెట్ ఎవరు?

Next Story