మూడు ఆయుధాలకు కాంగ్రెస్‌ పదును... ఏంటవి?

మూడు ఆయుధాలకు కాంగ్రెస్‌ పదును... ఏంటవి?
x
Highlights

అస‌లైన ఎన్నిక‌ల బరిలోకి దిగిన త‌రువాత, ఆ ముడు అస్త్రాలను ప్రయోగించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే కూట‌మి కట్టి త‌న బ‌లానికి మ‌రింత బ‌లాన్ని...

అస‌లైన ఎన్నిక‌ల బరిలోకి దిగిన త‌రువాత, ఆ ముడు అస్త్రాలను ప్రయోగించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే కూట‌మి కట్టి త‌న బ‌లానికి మ‌రింత బ‌లాన్ని పెంచుకుంది కాంగ్రెస్. అయినా ఎక్కడో అనుమానం పీడిస్తోంది. గులాబీదళాన్ని ఎదుర్కొనేందుకు త‌మ బ‌లం స‌రిపోతుందా అని, ఆలోచిస్తోంది. అందుకే మ‌రో 3 ఆయుదాల‌ను సిద్దం చేసుకుంది. అదే గుజరాత్‌ ఫార్ములా. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానేే, తెలంగాణలోనూ అప్లై చేయాలనుకుంటోంది టీపీసీసీ. ఈ ఫార్ములాతో గుజ‌రాత్‌లో కాంగ్రెస్ గెల‌వ‌కపోయినా, బీజేపీని ముచ్చెమటలు పట్టించింది. బీజేపీని ఓడించి, గెలిచినంత పని చేసింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఈ ఫార్ములాపై దృష్టి పెట్టింది.

ఇటీవలి గుజరాత్‌ ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌, ఓబీసీ ఉద్యమ నేత అల్పేష్ ఠాకూర్‌, దళితఉద్యమనేత జిగ్నేష్‌ మేవానిలు సంచలనం సృష్టించారు. గుజరాత్‌లో భారతీయజనతా పార్టీకి ముచ్చెముటలు పట్టించారు. దేశ ప్రధాని ప్రచారానికి వచ్చినా, బోటాబొటిన సీట్లతో అధికారం చేపట్టినా, బిజేపి చావుతప్పి కన్నులొట్టపోయిన చందమైంది గుజరాత్‌‌లో. దీంతో తెలంగాణ కాంగ్రెస్ అదే వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లో అమలు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్‌లో పాతుకుపోయిన బిజేపిని ఎదుర్కొనడానికి సామాజికవర్గాల కోసం పోరాటం చేస్తున్న వారిని కలుపుకొని ధీటుగా సమాదానం చెప్పింది కాంగ్రెస్. బిజేపికి గట్టిపోటినిచ్చి ఏఐసిసి పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీకి గౌరవాన్ని దక్కించింది కూడా. దీంతో అదే స్ట్రాటజీని, అమలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.

రాష్ట్రస్థాయి నాయకులతో సంబంధం లేకుండానే ఏఐసిసి నేతలు రంగంలో దిగి బడుగు బలహీన వర్గాల నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రజాగాయకుడు గ‌ద్దర్, మంద‌కృష్ట, విమ‌ల‌క్క, ఆర్‌.కృష్ణయ్య లాంటి వాళ్లను, ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా ప్రయోగించాలనుకుంటోంది కాంగ్రెస్. మంద‌కృష్ట కూడా కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నారు. అన్నీ కుదిరితే కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసే అవ‌కాశం కూడా ఉంది. మంద‌కృష్ణ కాంగ్రెస్‌తో కలిసి రావ‌డం ద్వారా, మాదిగ కులం ఓట్లు కాంగ్రెస్‌కే గంప‌గుత్తగా ప‌డతాయ‌ని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అందుకే మంద‌కృష్ట వైపు చూస్తోంది.

ఇక విమ‌ల‌క్క లాంటి క‌ళాకారుల‌ను పార్టీలోకి తీసుకురావడం ద్వారా స‌మాజంలో టీఆర్ఎస్ వ్యతిరేక‌త‌ ఎక్కువ చేసి చూపించడానికి ఉప‌యోగ‌ప‌డతాయ‌నేది కాంగ్రెస్ వ్యూహం. అందుకే కాంగ్రెస్ ప‌క్కా వ్యూహంతో ఒక్కో సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు ల‌ాక్కునే ప్రయ‌త్నం చేస్తుంది. సోషల్ ఇంజినీరింగ్‌తో ఓట్ల సమీకరణకు ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములాపై గట్టి నమ్మకం పెట్టుకుంది. ఈ ఫార్ములానే తమను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందన్న దీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. చూడాలి మరి గుజరాత్ కాంగ్రెస్ ఫార్ములా తెలంగాణలో పనిచేస్తుందో లేదో...

Show Full Article
Print Article
Next Story
More Stories