logo

నోట్లతో ఓటర్ల‌కు గాలం.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.

నోట్లతో ఓటర్ల‌కు గాలం.. గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.


ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం ఉండటంతో ప్రలోభాల పర్వం వేగం పుంజుకుంది. నోట్లతో ఓట్లు కొనేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 130 కోట్ల నగదు పట్టుబడింది. నోట్లతో ఓట్లకు ఎర వేసే ఎత్తుగడలు పెరిగిపోయాయి. అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం వెదజల్లుతున్నారు. వీటితో పాటు గెలుపే లక్ష్యంగా భారీ నజరానాలు అందజేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతుంది. గురువారం వివిధ ప్రాంతాల్లో మరో కోటి రూపాయల వరకు పట్టుబడింది. హైదరాబాద్ బేగంబజార్‌లో 50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో నగదు తరలిస్తుండగా ముందస్తుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్ధి నగదుగా గుర్తించారు. దీంతో పాటు సికింద్రాబాద్‌ సమీపంలోని చిలకలగూడలో మరో ఐదు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రేటర్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో కీలక అభ్యర్థికి ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్లు పట్టుబడిన వారు చెప్పినట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి షాద్ నగర్ సమీపంలో 34 లక్షల 50వేల రూపాయలు పట్టుబడ్డాయి. ఈ డబ్బు ప్రధాన పార్టీ అభ్యర్థి అనుచరుడి డబ్బుగా అనుమానిస్తున్నారు. కూకట్ పల్లి బాలాజీ నగర్ లో డబ్బు సంచులను తరలిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. పట్టుకున్న నగదు ఓ ప్రధాన పార్టీకి చెందిన వ్యక్తిదంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలంలో 3 కోట్ల 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ప్రాంతానికి చెందిన గోపాలరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు నగదు సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం జనగామ మండలంలో భారీగా నగదు పట్టుబడింది. పెంబర్తి దగ్గర కారులో తరలిస్తున్న 5 కోట్ల 80 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భారీగా నగదు పట్టుబడింది. టాటా ఏస్ వాహనంలో 13 లక్షల రూపాయలు తరలిస్తుండగా ఆలేరు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బయ్యారం వెళుతుండగా పోలీసులు ఈ నగదును గుర్తించారు. ఎన్నికల అవసరాల కోసమే డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదును సీజ్ చేసి ఎమ్మార్వో కార్యాలయంలో అప్పగించారు.

chandram

chandram

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top