బుజ్జగింపులు... ఊరడింపులు భవితను నిర్ణయిస్తాయా?

బుజ్జగింపులు... ఊరడింపులు భవితను నిర్ణయిస్తాయా?
x
Highlights

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిత్రపక్షాలను కలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమం ఇప్పటి వరకైతే మిశ్రమ ఫలితాలను సాధించింది. ఈ భేటీలు ఇచ్చే ఫలితాలను బట్టే...

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిత్రపక్షాలను కలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమం ఇప్పటి వరకైతే మిశ్రమ ఫలితాలను సాధించింది. ఈ భేటీలు ఇచ్చే ఫలితాలను బట్టే రాబోయే ఎన్నికల్లో బీజేపీ కార్యాచరణ ఉండనుంది. ఏయే మిత్రపక్షాలు రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో తమతో ఉండగలవనే అంశాన్ని తేల్చుకునేందుకు ఇది అవకాశాన్ని అందిస్తోంది. అసంతృప్తితో ఉన్న పార్టీలను బుజ్జగించే అవకాశం కూడా బీజేపీ కి లభించినట్లయింది. అండగా ఉండే పార్టీలేవో తేలితే ఇక మిగితా అంశాలపై దృష్టి పెట్టవచ్చునని బీజేపీ భావిస్తోంది.

నిజానికి ఎన్నికల సమయంలో మిత్ర పక్షాల డిమాండ్లు పెరిగిపోతాయనే విషయం బీజేపీ ముందుగానే గ్రహించింది. ఆ సర్దుబాట్లలో తాను కొన్ని సీట్లను కోల్పోక తప్పదని భావించింది. అందుకే ఇప్పటి వరకూ బీజేపీ పెద్దగా ఉనికి చాటుకోలేకపోయిన ప్రాంతాల్లో కొన్ని సీట్లను అదనంగా సాధించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే దక్షిణాది పై దృష్టి సారించింది. కర్నాటకలో బీజేపీ వ్యూహం దాదాపుగా ఫలించినప్పటికీ అధికారం చేజిక్కించుకునేందుకు అడుగు దూరంలో ఆగిపోయింది. కర్నాటక తరహా వ్యూహాన్నే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఇప్పుడు బీజేపీకి దూరమైంది. ఇక్కడ వైసీపీ లేదా జనసేన ....రెండిటిలో ఏదో ఒకదానితో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీ ఇప్పటికే అక్కడి ప్రధాన పార్టీలపై పరోక్షంగా పట్టును సాధించింది. రజనీకాంత్, కమల్ హాసన్ తదితరుల నాయకత్వాల్లో కొత్తగా వచ్చే పార్టీలు బీజేపీతో ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాలి. లోక్ సభ ఎన్నికల వేళ అది బీజేపీకి కొంత ఉపకరించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం ఆ పార్టీకి కొంత ఊరటనిస్తోంది. ఆ ఫలితాలు ఎంత మేరకు ఓట్లుగా మారుతాయో....అందుకు బీజేపీ వ్యూహాలు ఎలా తోడ్పడుతాయో వేచి చూడాల్సిందే.

మొత్తం మీద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమం బీజేపీ మిత్రపక్షాలలు తమ గొంతు విన్పించేందుకు అవకాశం కల్పించింది. వాటితో ఉన్న చిన్నపాటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాటిల్లో ఉన్న అసంతృప్తిని దూరం చేసే ప్రయత్నాలకు వీలు కల్పిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న చోట, బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కాస్తంత బెట్టు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం మిత్ర పక్షాల ఒత్తిళ్ళకు బీజేపీ కాస్తంత లొంగుబాటు ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే ఈ దఫా జాతీయ స్థాయిలో కంటే కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ పొత్తులు కీలకం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories