బాన్సువాడ కాంగ్రెస్‌లో కల్లోలం... ఎవరికి లాభం?

బాన్సువాడ కాంగ్రెస్‌లో కల్లోలం... ఎవరికి లాభం?
x
Highlights

కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ ముదురుతోంది. అభ్యర్ధి తానంటే తానంటూ పోటాపోటీగా ఆశావాహులు సమావేశాలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్ధిగా...

కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయతీ ముదురుతోంది. అభ్యర్ధి తానంటే తానంటూ పోటాపోటీగా ఆశావాహులు సమావేశాలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్ధిగా లేకుంటే రెబల్‌గా పోటీలో ఉండటం ఖాయమనే సంకేతాలిస్తున్నారు. రాష్ట్రంలో వీఐపీ నియోజకవర్గంగా ఉన్న బాన్సువాడలో.. కాంగ్రెస్ టికెట్ల లొల్లి కాక పుట్టిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించకున్నా.. వస్తున్న లీకులతో.. ఆశావాహులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ... పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాష్ట్రంలోనే వీఐపీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన బాన్సువాడ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారింది. నియోజకవర్గ ఇంచార్జీ కాసుల బాలరాజు అభ్యర్ధిత్వం దాదాపుగా ఖరారైందని.. ప్రచారం కావడంతో.. ఇదే టికెట్టుపై ఆశ పెట్టుకున్న మల్యాద్రిరెడ్డి అసమ్మతి గళం వినిపిస్తున్నారు. బాలరాజుకు టికెట్ ఇస్తే.. తాను బరిలో ఉండటం ఖాయమని మల్యాద్రిరెడ్డి వర్నిలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కుండ బద్దలు కొట్టారు. బాలరాజుకు టికెట్ ఇస్తే.. ఈ నియోజకవర్గంలో మళ్లీ టీఆర్ఎస్ గెలవడం ఖాయమని అభ్యర్ధిని మర్చాలంటూ కార్యకర్తలు తీర్మానం చేశారు.

బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్ధిగా.. కాసుల బాలరాజు దాదాపుగా ఖరారయ్యారు. ఈ మేరకు ఆయనకు అధిష్ఠానం నుంచి హామి ఉండటం వల్ల.. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. బాలరాజు ఇంటింటి ప్రచారం ప్రారంభించడంతో.. మల్యాద్రిరెడ్డి వర్గం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. బాలరాజు అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించారు. మల్యాద్రిరెడ్డికి టికెట్ ఇస్తే.. బాన్సువాడ గెలిపిస్తామని తేల్చిచెప్పారు. ఇటు మల్యాద్రిరెడ్డి సైతం తాను బరిలో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. నామినేషన్ సైతం దాఖలు చేయనున్నట్లు చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్ధాయికి చేరింది. ఒకరికి టికెట్ వస్తే మరొకరు సహకరించే పరిస్ధితి కనిపించడం లేదు. పోటీకి సై అంటే సై అంటున్నారు ఆ ఇద్దరు నేతలు. బాన్సువాడతో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోను టికెట్టు టెన్షన్ కొనసాగుతుంది. చివరి నిమిషం వరకు ఎవరికి టికెట్ వస్తుందో తెలియని అయోమయ పరిస్ధితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories