అ.. అంటే అందం... ఆ.. అంటే ఆనందం... అరకు హరివిల్లు

అ.. అంటే అందం... ఆ.. అంటే ఆనందం... అరకు హరివిల్లు
x
Highlights

ప్రశాంత వాతావరణం... పచ్చని తోటలు.. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, సవ్వడి చేసే జలపాతాలు, హాయ్ అంటూ వస్తూ పోతూ పలకరించే చల్లని గాలులు, కళ్లు తిప్పుకోలేని...

ప్రశాంత వాతావరణం... పచ్చని తోటలు.. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, సవ్వడి చేసే జలపాతాలు, హాయ్ అంటూ వస్తూ పోతూ పలకరించే చల్లని గాలులు, కళ్లు తిప్పుకోలేని అందాలు. ప్రకృతి సౌందర్యం ఒక్క చోట చేరితే ఇలానే ఉంటుందా అనిపించే అనుభూతిని పంచే ప్రదేశమే అరకులోయ... అరుకు అంటేనే మన కళ్ల ముందు ప్రకృతి రమణీయత ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు భూతల స్వర్గంగా భావిస్తారు..

హిల్ స్టేషన్స్ అనగానే ఎత్తైన కొండలు, లోతైన లోయలు, చల్లని వాతావరణం, కనుచూపు మేర పరుచుకున్న పచ్చని ప్రకృతి, వంపులు తిరుగుతూ ముందుకు దూకే జలపాతాలు తలపుకొచ్చి మనసును గిలిగింతలు పెడతాయి. చాలామందికి కొండప్రాంత పర్యాటక ప్రదేశాలంటే ముందుగా ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులు, మనాలి, కాశ్మీర్, డార్జీలింగ్, నైనిటాల్, ముస్సొరి వంటి ప్రదేశాలే గుర్తొస్తాయి. అయితే మనకు దూరాన ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని, మనసును దోచుకొనే పర్యాటక ప్రదేశాలు ఆంధ్రాలోనే ఉంది అదే అరుకు ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు అరుకు.

విశాఖపట్టణానికి 115 కిలో దూరంలో ఉంది. ఏడాది పొడవునా సందర్శించదగిన ప్రదేశమైన అరకు.. సముద్రమట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒడిశాతో సరిహద్దు పంచుకుంటున్న అరకుకు మరోవైపు జీవ వైవిధ్యంతో కూడిన అనంతగిరి, సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఉంటుంది. ప్రకృతి అందాలకే గాక అరుదైన కాఫీ రకాలకూ అరకు అసలైన చిరునామా. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇక్కడి గిరిజన మహిళలు సాగు చేస్తున్న పలు కాఫీ రకాలు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.

అందమైన ప్రకృతి, ఆకు పచ్చని కొండలు, చుట్టూ విరబూసిన అవిసె తోటలతో పసుపు రంగు పులుముకున్నట్టుండే లోయల మధ్య మైదాన ప్రాంతం, నేలను ముద్దాడే మంచు మేఘాలు, ఇలా వచ్చి అలా వెళ్లే శీతల పవనాలు... మనసుకు, శరీరానికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. అక్కడి మ్యూజియం, జలపాతాలు, బొర్రాగుహలు, ప్రకృతి అందాల్ని తిలకిస్తూ మైమరిచిపోతుంటారు. ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం చూస్తూ మైమరిచిపోతారు.

అరకు అందాలకు వింటర్ సీజన్ మరింత అందాన్నిస్తుంది. పొగమంచులో పచ్చని చెట్లు.. కొండల మధ్య అరకు అందాలు కశ్మీర్ ను తలపిస్తున్నాయి. దీంతో వింటర్లో అరకు టూర్ కు క్యూకడుతున్నారు టూరిస్టులు. విశాఖ టూ అరకు జర్నీ ఓ స్వీట్ మెమోరీ. పచ్చని చెట్ల మధ్య నుంచి మలుపులు తిరిగే రోడ్డులో ప్రయాణం అంటే పర్యాటకులకు ఎంతో ఇష్టం.. ఎత్తైన కొండలు… టన్నెల్స్ నుంచి సాగే ట్రైన్ జర్నీ ఓ మధురానుభూతి.

Show Full Article
Print Article
Next Story
More Stories