దళపతి వస్తేనే కమలానికి దారి కనిపిస్తుందా? జోష్‌ తగ్గిందా? తగ్గించారా?

దళపతి వస్తేనే కమలానికి దారి కనిపిస్తుందా? జోష్‌ తగ్గిందా? తగ్గించారా?
x
Highlights

కమలనాథులు అమిత్‌ షాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన వస్తారు, దుమ్మురేపే సభలతో దమ్ము చూపుతారని నిరీక్షిస్తున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు మహాకూటమిపై దూకుడు...

కమలనాథులు అమిత్‌ షాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన వస్తారు, దుమ్మురేపే సభలతో దమ్ము చూపుతారని నిరీక్షిస్తున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు మహాకూటమిపై దూకుడు ఎలా పెంచాలో దిశానిర్దేశం చేస్తారని ఎదురుచూస్తున్నారు. మొన్న దక్షిణ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన అమిత్‌ షా, త్వరలో ఉత్తర తెలంగాణలో పర్యటించబోతున్నారు. దీంతో బీజేపీ చీఫ్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కాషాయ నేతలు.

ఏ కూటమిలోనూ చేరకుండా, ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడైన బీజేపీ కూడా, ఇక సభలతో హోరెత్తించాలని భావిస్తోంది. అందుకే త్వరలో అమిత్‌ షాతో సభలు నిర్వహించాలని డిసైడయ్యింది. దక్షిణ తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సక్సెస్ కావడంతో, ఉత్తర తెలంగాణపై దృష్టిసారించింది కమలం. ఉత్తర తెలంగాణకు గుండెకాయగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్‌లో, భారీ ఎత్తున బహిరంగ సభను పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఈనెల 10న కరీంనగర్‌లోని స్థానిక ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడానికి, ఓకే చెప్పడంతో రాష్ట్ర నాయకత్వం యుద్ధ ప్రతిపాదికన బహిరంగ సభ ఏర్పాట్లలో తలమునకలైంది.
పాలమూరు శంఖారావానికి భారీగా జనం తరలివరావడంతో, కరీంనగర్‌ సభకూ, భారీ ఎత్తున జన సమీకరణకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి 25 మంది నుంచి ఎంత మందినైనా సమావేశానికి తరలించాలని, ఈలోగానే అన్ని గ్రామాల్లో బహిరంగ సభ గురించి విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించి, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా సంసిద్ధులను చేయాలని భావిస్తున్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలను, యువకులను, ఉత్సాహవంతులను పార్టీలో చేర్చుకోవాలని, వారందరిని ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు.

ఒక్కో జిల్లా నుంచి 25 వేల మందిని తరలించినా సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు రాష్ట్ర నాయకులు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని, ఆశావహులందరు ఈ సమావేశానికి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అమిత్‌షా పాల్గొననున్న బహిరంగ సభను విజయవంతం చేసి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది కమలం. ఇదే జోష్‌తో ఎన్నికల్లో తలపడాలని పట్టుదలగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories