కేసీఆర్‌పై అంతులేని అభిమానం.. సంక్షేమ పథకాలతో గులాబీ గుభాళింపు

x
Highlights

ఎవరికీ అందనంత జెట్‌ స్పీడ్‌లో కారు దూసుకెళ్లింది. సైకిల్‌ను తుక్కుతుక్కు చేసి, ప్రజాకూటమిని పాతానికి తొక్కేసింది. తనకు ఎదురేలేదు, తిరుగేలేదని...

ఎవరికీ అందనంత జెట్‌ స్పీడ్‌లో కారు దూసుకెళ్లింది. సైకిల్‌ను తుక్కుతుక్కు చేసి, ప్రజాకూటమిని పాతానికి తొక్కేసింది. తనకు ఎదురేలేదు, తిరుగేలేదని గులాబీదళాధిపతి నిరూపించారు. ఎవరూ ఊహించని, కలలో కూడా భావించని, అసలు సర్వేలకే అంతుచిక్కని అఖండ విజయాన్ని టీఆర్ఎస్‌ ఎలా సాధించగలిగింది. గులాబీ సంచలన విక్టరీకి ఆరు కారణాలున్నాయి విజయానికి ఆ ఆరు మెట్లు ఏంటో చూద్దాం. అవును. తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై, నాలుగున్నర కోట్ల తెలంగాణ జనం అంతులేని అభిమానం చూపారు. ఆయనను గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ హేమాహేమీలంతా వచ్చారన్న కేసీఆర్‌కు, మేమున్నామంటూ అండగా నిలిచారు. మాకు మా కేసీఆర్‌ కావాలి ఆయన పాలనే ఉండాలి ఎవరు మీరంతా అంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అగ్రనాయకులను తిరస్కరించారు. వారి అడ్రస్‌లు గల్లంతు చేశారు. ఒక్కసారి అభిమానిస్తే, ఎంతటి ఘన విజయాన్ని అందించగలరో, తెలంగాణ ప్రజానీకం నిరూపించారు. అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను కేసీఆర్‌ ముఖం చూసి క్షమించేంతగా, కేసీఆర్‌ను మనసా వాచా నమ్మారు జనం.

దేశంలో కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కేసీఆర్‌. రైతు బంధుతో రైతు బాంధవుడిగా అవతరించి, అన్నదాతల పెట్టుబడి కష్టాలను తీర్చారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం చేశారు. ఆసరా పెన్షన్లతో వృద్దులకు ఊతకర్రగా, పెద్దకొడుకుగా నిలిచారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌తో పేదింటి ఆడపిల్లలకు పెద్ద దిక్కయ్యారు. మిషన్‌ భగీరథతో నీరులేని గ్రామాలకు భగీరథుడిలా నీళ్లందించారు. మిషన్‌ కాకతీయతో చెరువులకు జీవకళ తెచ్చారు. కాళేశ్వరం, పాలమూరు వంటి సాగునీటి ప్రాజెక్టులతో బీడుబారిన భూములకు నీళ్లందించే యజ్ఝానికి బాటలేశారు. రైస్ సబ్సిడీ, చేనేతకు చేయూత, కులాల వారిగా, మతాలవారీగా ప్రతిఒక్కర్నీ పథకాలు, భవనాలతో తనవారిని చేసుకున్నారు కేసీఆర్.

కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా ప్రజాకూటమి అంటూ జట్టుకట్టిన చంద్రబాబు, ఒకరకంగా కేసీఆర్‌ను గెలిపించడానికే పొత్తుపెట్టుకున్నాడా అన్నట్టుంది ఫలితాల తీరు. ఎప్పుడైతే కాంగ్రెస్‌‌తో పొత్తుపెట్టుకున్నాడో, అప్పుడే టీఆర్ఎస్‌కు తిరుగులేని అస్త్రంగా మారాడు చంద్రబాబు. మరోసారి తెలంగాణను ఆగం చేయడానికి చంద్రబాబు వస్తున్నాడని, సెంటిమెంట్‌‌ రగిలించారు కేసీఆర్‌. ఏపీ సీఎం అయిన బాబుకు, తెలంగాణలో పనేంటని, భావోద్వేగాన్ని రగిలించడంలో సక్సెస్‌ అయ్యారు గులాబీ బాస్. ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ది అంశాలు, చర్చకు రావాల్సిన ఎన్నికల ప్రచారంలో, ఏకైక టాపిక్‌గా మారాడు చంద్రబాబు. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే, బాబుకు కీలు బొమ్మ సర్కారుగా మారుతుందని తనదైనశైలిలో, జనాలకు అర్థమయ్యేలా వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశాడని, కూటమి అధికారంలోకి వస్తే అడ్డుకుంటాడని, అభివృద్ది ఆగిపోతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని తిరిగి, ఏపీతో కలిపేస్తాడని హరీష్‌‌ కూడా వ్యాఖ్యానించారు. దీనికితోడు చంద్రబాబు, ఒకట్రెండు సభలతో ఊరుకోకుండా, అదేపనిగా విస్తృతంగా పర్యటించారు. కేసీఆర్‌పై అనేక విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజాకూటమికి మేలు కంటే కీడే చేశాయని, తిరుగులేని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. చంద్రాబు విషయంలో టీఆర్ఎస్‌ సంధించిన సెంటిమెంట్‌ అస్త్రం, ఉద్యమంలా తెలంగాణ జనాన్ని ఏకం చేసింది. చంద్రబాబు బూచి, జనాలను నిజంగా భయపెట్టింది. కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలు, తిట్లు తమనే అంటున్నట్టుగా జనం పర్సనల్‌గా ఫీలయ్యారు. చివర్లో లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేను బట్టి కూడా, జనం కూటమి నుంచి టర్నయి టీఆర్ఎస్‌ వైపు మళ్లేలా చేశాయని విశ్లేషకుల భావన. ఉద్యమంలో తెలంగాణపై అనేక కుట్రలు చేసిన లగడపాటి టీఆర్ఎస్‌ ఓటమి అనడమేంటని, రగిలిపోయారు. అలా చంద్రబాబు, లగడపాటిల రూపంలో, సెంటిమెంట్, బ్రహ్మాస్త్రంలా పని చేసింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ తనదే అనుకుంది టీడీపీ, కాంగ్రెస్ ప్రజాకూటమి. ఇక్కడ సీమాంధ్రులు ఎక్కువ సంఖ్యలో ఉండటమే వారి ధీమాకు కారణం. కానీ కేసీఆర్‌ గ్రేటర్‌లో, కేటీఆర్‌ అనే బాణాన్ని వదిలాడు. ఇప్పటికే ఐటీ మంత్రిగా, డైనమిక్‌ మినిస్టర్‌గా సిటిజనుల్లో మంచి పేరు తెచ్చుకున్న కేటీఆర్‌, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో అంతాతానై వ్యవహరించాడు. నాలుగున్నరేళ్లలో సీమాంధ్రుల మనసులు గెలిచామని చెప్పుకున్నారు. ఇక్కడికొచ్చి స్థిరపడినా, మీరంతా తెలంగాణవారే, హైదరాబాదీలేనని ప్రసంగాలు చేశారు. దీనికితోడు టీడీపీ, కాంగ్రెస్‌ వ్యూహాలపై సామాజిక సమీకరణల స్ట్రాటజీని అప్లై చేశారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్న, ఇక్కడి సెటిలర్‌ కాపు, రెడ్డి సామాజికవర్గాలతో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. గంపగుత్తగా సీమాంధ్ర ఓటర్లు ప్రజాకూటమికి పడకుండా, ఓటర్లలో విభజన తేవడంలో సక్సెస్‌ అయ్యారు. అప్పటికే సానుకూలంగా ఉన్న ఇతర ఓట్లకు తోడు, ఈ సెటిలర్‌లను కూడా తమవైపు తిప్పుకున్నారు. గతంలో గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తిరిగిన అనుభవం, అమలు చేసిన వ్యూహాలు, కేటీఆర్‌ అమ్ములపొదిలో అస్త్రాలయ్యాయి. నాడు గ్రేటర్‌ మేయర్ పీఠాన్ని తండ్రికి కానుకగా ఇచ్చిన కేటీఆర్, ఇప్పుడు అంతకంటే ఘనంగా, అత్యధిక ఎమ్మెల్యే సీట్లను బహుమానంగా ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నారు. వాట్‌ ఏ ఫాదర్...వాట్‌ ఏ సన్.

ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను తిరుగులేని ఓటు బ్యాంకు సంపాదించిన కేసీఆర్‌, మేనిఫెస్టోతో వారిని మరింత దగ్గరకు చేర్చుకున్నారు. పోటాపోటీగా కాంగ్రెస్‌ కూటమి అందిస్తున్న వరాలను మించి, ప్రకటించారు. సంక్షేమ పరిధిలో లేనివారిని కూడా, ఆకర్షించారు. ఆసరా పెన్షన్ల రెట్టింపుతో ముసలీముతకలకు భరోసా ఇచ్చారు. వికలాంగులకు మరింత ఎక్కువగా పెన్షన్‌ ఇస్తానని, సపోర్ట్‌ ఇచ్చారు. తనపై ఆగ్రహంతో రలిగిపోతున్న నిరుద్యోగులను చల్లబరిచేందుకు, మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు మరిన్ని ప్రోత్సాహకాలు పెంచుతామన్నారు. ఇలా ఇంతకుముందే అమలవుతున్న పథకాలకు తోడు, ఇంకొన్ని స్కీమ్‌లను ప్రకటించి, సామాన్యుల సామాజిక భద్రతకు గొడుగుపట్టారు కేటీఆర్.

ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, వెల్ఫేర్ స్కీములు, సెంటిమెంట్‌ అస్త్రాలు పక్కాగా చూసుకుంటూనే, మొదటి నుంచి సామాజిక సమీకరణాలను పక్కాగా చూసుకుంటున్నారు గులాబీ దళాధిపతి. దళితులు తనకు కాస్త వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, వారి ఓట్లను ఓబీసీలతో పూడ్చుకోవాలనుకున్నారు. టీడీపీకి ఓటు బ్యాంకుగా నిలిచిన బీసీలను అనేక పథకాలతో తనవైపు మళ్లించుకున్నారు. గొర్రెలు, బర్రెలు, నేతన్నలకు పెన్షన్లు ఇచ్చారు. అలాగే గిరిజనులకూ అనేక వరాలు ప్రకటించారు. తండాలను పంచాయతీలను చేసిన ఘనత తనదే అంటూ, గిరిజనులను ఆకర్షించారు. రంజాన్ ‌సమయంలో ముస్లింలకు కానుకలు, షాదీ ముబారక్‌, రెసిడెన్షియల్ స్కూళ్లు, 12 శాతం రిజర్వేషన్ ‌హామీలతో ముస్లింలు తననే నమ్మేటట్టుగా చూసుకున్నారు. ఎంఐఎం మద్దతు తీసుకుని, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌తో పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ముస్లింల ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలా చేశారు. అలాగే క్రిస్‌మస్‌ టైంలో పేద క్రైస్తవులకు బట్టలు, కానుకలు అందజేశారు. వారికి ప్రత్యేక భవన్‌ కట్టిస్తామన్నారు. సిక్కులు, కేరళీయులకూ వరాలు ప్రకటించారు. ఇలా కుల, మత, ప్రాంతం అన్న బేధాల్లేకుండా సామాజిక సమీకరణాలు పక్కాగా చూసుకున్నారు. ప్రజల మనసు గెలిచారు. తానే తెలంగాణకు ఏకైక రక్షకుడినని విశ్వాసం కల్పించారు. తన అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్‌ ఉద్దండ నాయకులనూ మట్టికరిపించారు. తెలంగాణ ఉద్యమం నుంచి రెండోసారి ఎన్నికల వరకూ తనకు తిరుగులేదని నిరూపించారు. దటీజ్ కేసీఆర్‌ అనిపించుకున్నారు. ఇలా ఆరు అస్త్రాలు, కేసీఆర్‌కు తిరుగులేని విజయం కట్టబెట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories