ప్రశాంత్‌ కిశోర్‌ కోసం టీడీపీ ప్రయత్నమా?

ప్రశాంత్‌ కిశోర్‌ కోసం టీడీపీ ప్రయత్నమా?
x
Highlights

ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మోడీ గెలుపులో నాడు తురుపు ముక్క. నితీష్‌ను విజయాబాట పట్టించిన వ్యూహకర్త. ఏపీలో జగన్‌ సునామీకి బాటలేసిన...

ప్రశాంత్‌ కిశోర్‌ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మోడీ గెలుపులో నాడు తురుపు ముక్క. నితీష్‌ను విజయాబాట పట్టించిన వ్యూహకర్త. ఏపీలో జగన్‌ సునామీకి బాటలేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్. మమతకు సైతం గెలుపు సూత్రాలు వివరించబోతున్న పొలిటికల్ వెపన్. ఇప్పుడు పీకే అనే ప్రశాంత్ కిశోర్‌‌ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసా ఏ పార్టీ అధినేత పీకేను తమ టీంలో చేర్చుకోవాలని తలపోస్తున్నారో తెలుసా చంద్రబాబు. అవును. టీడీపీ అధినేత పీకేను పిక్‌ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, సంచలనం సృష్టిస్తోంది. తనను పోటు పొడిచిన పీకే పట్ల, బాబుకు మనసెందుకు లాగుతోంది వైసీపీ ఆయుధమైన పీకే, టీడీపీ అమ్ములపొదిలోకి అస్త్రమవ్వడానికి అంగీకరిస్తాడా?

తెలుగుదేశం దారుణంగా ఓడిపోయింది. అవును. మరి తిరిగి పట్టాలెక్కించాలంటే ఏం చెయ్యాలి?వచ్చే ఐదేళ్లకు సింహాసం అధీష్టించాలంటే ఎలాంటి వ్యూహాలు వేయాలి?2014లో జగన్‌ ఓడిపోయినప్పుడు ఏం చేశారు?ఇప్పుడు మనమేం చెయ్యాలి?విజయవాడలో జరిగిన టీడీపీ అంతర్మథనంలో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రశ్నలివి. అయితే కొందరు టీడీపీ నేతలు బాబుకు బ్రహ్మాండమైన ఒక ఐడియా ఇచ్చారట పలాన వ్యక్తి మన టీంలో ఉంటే, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనమేనని బాబును ఊరించారట. పొలిటికల్‌ వెపన్‌లాంటి రాజకీయ వ్యూహకర్త మనక్కూడా పని చేస్తే, తిరుగుండదని చెప్పారట పొలిటికల్ ఆయుధం ప్రశాంత్ కిశోర్ పీకే.

వినడానికిది విడ్డూరంగా, షాకింగ్‌గా అనిపించొచ్చుచంద్రబాబేంటి ప్రశాంత్ కిశోర్‌ ఏంటి ఇద్దరూ కలిసి పని చేయడమేంటని విస్తుపోవచ్చు ఇంతగా ఎందుకు విస్తుపోవాల్సి వస్తుందంటే, చంద్రబాబు, పీకేల మధ్య ఎన్నికల టైంలో మాటల యుద్ధం సాగింది. ట్వీట్ల వార్ హోరెత్తింది. జగన్‌ను గెలిపించేందుకు, చంద్రబాబును ఓడించేందుకు పీకే ఎన్నో అస్త్రశస్త్రాలు తయారు చేశారు. అవి టీడీపీని చిత్తు చేశాయి. చంద్రబాబు కూడా పీకేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ నుంచి వచ్చి, ఏపీలో రాజకీయం చేయడమేంటని ఫైరయ్యారు. పీకే కూడా స్ట్రాంగ్‌గానే కౌంటరిచ్చారు. ఇలా ఎన్నికల టైంలో వీరిద్దరి పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది. అయితే, ఇప్పుడు తనను పొడిచిన ఆయుధంతోనే, తిరిగి తన ప్రత్యర్థిని పొడవాలని చంద్రబాబు తపిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పీకేను చంద్రబాబు ఎందుకు పిక్‌ చేసుకోవాలనుకుంటున్నారు? పీకే డిస్కషన్‌ ఎందుకొచ్చింది ఎక్కడ ప్రస్తావన జరిగింది?

విజయవాడలో తెలుగుదేశం సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓడిన గెలిచిన అభ్యర్థులందరూ వచ్చారు. పార్టీ సీనియర్లు హాజరయ్యారు. దారుణ ఓటమికి దారి తీసిన కారణాలపై చర్చించారట. టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. టీడీపీ ఎన్నో ఉత్థానపతనాలు చూసిందని, ఇదొక పరిణామం అని, గోడకు కొట్టిన బంతిలా తిరిగి పార్టీ పుంజుకుంటుందని ధైర్యం నూరిపోశారట. ఈ క్రమంలోనే దేశంలోనే మోస్ట్‌ పాపులర్ అండ్ కాస్ట్‌‌లీ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తావన వచ్చిందట. కొందరు టీడీపీ ముఖ్యనేతలు, చంద్రబాబు దగ్గర పీకే ప్రస్తావన తెచ్చారట. వైసీపీతో పీకే కాంట్రాక్ట్‌ ముగిసిందని, మనం అతన్ని సంప్రదిస్తే బాగుటుందని సలహా ఇచ్చారట. ఈ మేరకు చంద్రబాబుకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఆసక్తి చూపారట. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం, అప్పుడే ప్రశాంత్ కిశోర్ బృందంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఐపాక్‌ టీంను బాబు టీం సంప్రదించినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్‌ కిశోర్‌ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. నవరత్నాలకు రూపకల్పన చేశారు. జగన్ పాదయాత్ర, అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియాలోనూ వైసీపీ పట్ల అగ్రెసివ్‌గా క్యాంపెయిన్‌ చేశారు. రావాలి జగన్ కావాలి జగన్‌, బైబై బాబు నినాదాల సృష్టికర్త కూడా ఈ‍యనే. పోలింగ్‌ ముగిసిన సాయంత్రమే, ల్యాండ్‌స్లైడ్ విక్టరీ ఖాయమని జగన్‌కు ఎగ్టిట్‌పోల్‌ రిపోర్ట్ కూడా ఇచ్చారట. ఇప్పుడు జగన్‌తో ఒప్పందం ముగిసింది. మమత కూడా పీకేకు కాల్‌ చేశారట. ఈలోపల టీడీపీలో పునరుత్తేజం తెచ్చేందుకు చంద్రబాబు కూడా పీకే అనే అస్త్రం కోసం ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది.

ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐ-ప్యాక్‌ను తెలుగుదేశం నేతలు కొందరు సంప్రదించారట. దీనిపై ప్రశాంత్‌ కిశోర్‌ను కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కాంటాక్ట్ చేశారట. టీడీపీ మిమ్మల్ని సంప్రదించిందా అని అడిగతే, సంప్రదించే వారిని ఎవరు ఆపగలరని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారట పీకే. ఏపీలో తన లాస్ట్‌ అసైన్‌‌మెంట్‌ వైసీపీతోనేనని, ఎన్నికల ఫలితాలతో అది కూడా ముగిసిందని అన్నారట. అయితే పీకే టీం అప్రోచ్‌ అయ్యారన్న వార్తలను మాత్రం టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. పీకేను సంప్రదించారన్న వార్త కేవలం పుకారేనని కొట్టిపారేశారట. మొత్తానికి వైసీపీ తనను ఓడించిన ఆయుధంతోనే, తిరిగి యుద్ధం చేయాలని టీడీపీ భావిస్తోందని ఈ వార్తలను బట్టి అర్థమవుతోంది. అయితే టీడీపీ పిలిస్తే పీకే వెళతారా తనను ఓడించిన పీకేను టీడీపీ నిజంగానే పిలుస్తుందా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories