చిన్నారి రిషి..స్వయంకృషి..తెచ్చింది అంతర్జాతీయ ఖ్యాతి!

చిన్నారి రిషి..స్వయంకృషి..తెచ్చింది అంతర్జాతీయ ఖ్యాతి!
x
Highlights

తెలివితేటలు ఉండడం ఒక ఎత్తైతే, వాటిని సరైన దారిలో ఉపయోగించడం ముఖ్యమైన విషయం. అందులోనూ చిన్నతనంలో వచ్చిన ఆలోచనలను అమలులోకి తీసుకురావాలంటే దానికి తగిన...

తెలివితేటలు ఉండడం ఒక ఎత్తైతే, వాటిని సరైన దారిలో ఉపయోగించడం ముఖ్యమైన విషయం. అందులోనూ చిన్నతనంలో వచ్చిన ఆలోచనలను అమలులోకి తీసుకురావాలంటే దానికి తగిన వాతావరణం కుటుంబంలో ఉండాలి. పువ్వు పుట్టగానే పరిమళించినా, దాని సుగంధాన్ని అందరికీ అందేలా చేయడమూ ముఖ్యమైనదే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అటువంటి విశేషమే. ఒక పద్నాలుగేళ్ళ బాలుడు ప్రతి రోజూ ఏం చేస్తాడు? స్కూలుకు వెళతాడు.. అక్కడ నుంచి వచ్చాకా ఇప్పుడైతే ఆటలాడుకునే అవకాశం ఎవరికీ ఉండడం లేదుకదా.. అమ్మ పక్కన చేరి టీవీ చూస్తాడు. అంతే కదా. ఇక సెలవు రోజుల్లో అయితే, ఏముంది మహా అయితే ఓ సినిమా చూస్తాడు. అంతకు మించి చేసేదేమీ ఉండదు. కానీ, అందరూ అలా ఉండరు. ఒక్కోచోట రిషి లాంటి పిల్లలు ఉంటారు. అటువంటి వారికి కుటుంబంలోని పెద్దలు సహకరిస్తే ఇదిగో ఇలాగే చిన్నతనంలోనే ఊరికి ఉపకారిగా నిలుస్తారు. ప్రపంచ స్థాయిలో తమ వారికీ, తమ ఊరికీ పేరు తెస్తారు.

తన దేశం గురించి.. తన ప్రాంతానికి సంబంధించిన పరిస్థితుల గురించి అంతర్జాతీయ వేదికలపై వినిపించే అవకాశం వస్తే అది అద్భుతమే కదా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ ప్రాంతంలో ఉన్న వారికి కావాల్సిన సహకారాన్ని అందించగలిగితే ఆ ప్రాంతంలోని అందరికీ ఏంతో ఉపయోగకరం కదా. ఆ అవకాశం ఓ పద్నాలుగేళ్ళ బాలుడికి వస్తే అది ఆ ప్రాంతం వారందరికీ గర్వకారణంగా నిలుస్తుంది కదా. సరిగ్గా అదే జరిగింది వేగేశ్న రిషివర్మ విషయంలో.

చిన్నోడే కానీ చిచ్చర పిడుగు!

రిషివర్మ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం లోని కాళ్లకూరు గ్రామానికి చెందినా చిన్నోడు. తండ్రి మహిధర్ రవికుమార్, తల్లి నీలిమ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడే రిషి వర్మ ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ హైదరాబాద్ లో చదువుకుంటున్నా.. సెలవులు వస్తే చాలు తన తాతగారి ఊరు కాళ్ళకూరు వేల్లిపోవాల్సిందే. అక్కడ అతనికి వ్యవసాయం.. పల్లెలలో ఉండేవారు ఆర్థికంగా పడే ఇబ్బందులూ తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా తొమ్మిదేళ్ళ వయసులో తన తాతగారి ఊరు వెళ్ళినపుడు వచ్చిన వరదల్లో ఆ ప్రాంతంలో రైతులు పడిన పాట్లు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. అంతేకాకుండా తన తాత రామరాజు నడిపిస్తున్న సోమరాజు చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలూ ఆకళింపు చేసుకున్నాడు. తాతగారి సేవా ద్రుక్ఫదానికి తన ఆలోచనలు అద్దాడు. దీంతో వయసులో చిన్నవాడైనా తన ఊరి వారికి ఎలాగైనా సహాయం చేసే విధంగా ఎదో ఒకటి చేయాలని సంకల్పించాడు. రిషికి అతని తల్లిదండ్రులూ, నానమ్మ తాతయ్యలు ప్రోత్సాహాన్ని అందించారు. ఇంకేముంది..తన ఆలోచనలకు పదును పెట్టాడు. దాంతో 'స్వయంకృషి' ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.

ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను మెప్పించి..

ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే 1మిలియన్..1బిలియన్ సంస్థ ప్రతినిధులు ఒకసారి రిషి వర్మ చదువుతున్న స్కూలుకు వచ్చారు. అప్పుడు వారు ఫ్యూచర్ లీడర్స్ అనే తమ కార్యక్రమం గురించి వివరించారు. ఆ సమయంలో వారికి తన ఆలోచనలు వివరించి చెప్పాడు రిషివర్మ. ఈ కుర్రాడు చెప్పిన స్వయంకృషి వివరాలు ఆ సంస్థ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. దాంతో న్యూయార్క్ లో తాము నిర్వహించే కార్యక్రమానికి అతనిని ఎంపిక చేశారు. అక్కడ రిషి తన ప్రాజెక్ట్ వివరాలను వివరించి ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల నుంచి అభినందనలు అందుకున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఈ ఫ్యూచర్ లీడర్ కార్యక్రమానికి ఎంపికైంది 20 మంది. వారిలో అందరికీ అక్కడ మాట్లాడే అవకాశం నిమిషం లోపే. అతి తక్కువ మందికి మాత్రం 3 నిమిషాల సమయం ఇచ్చారు. వారిలో రిషివర్మ ఒకడంటే అర్థం చేసుకోవచ్చు ఆ అంతర్జాతీయ సంస్థకు స్వయంకృషి కాన్సెప్ట్ ఎంతబాగా నచ్చిందో చెప్పడానికి.

ఏమిటీ 'స్వయంకృషి'?

స్వయంకృషి ప్రాజెక్ట్ లో భాగంగా తన ఊరిలో మొదట ఐదుగురు మహిళలను ఎంచుకున్నాడు. ఆ ప్రాంతంలో కొన్ని రకాల స్వీట్లు, మాంసాహార పచ్చళ్లు తయారు చేయడంలో మహిళలు నిపుణులు. ఆ అవకాశాన్నే రిషి అందిపుచ్చుకున్నాడు. వారికి బాగా తెలిసిన ఆ విద్యనే వారి ఆర్ధిక పరిపుష్టతకు నాందిగా మార్చడానికి వీలుగా ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాడు. తానేన్నుకున్న మహిళలతో ఐదు రకాల ఆహార ఉత్పత్తులు తాయారు చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటికే వివిధ రకాలుగా ఆ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన తాతగారి నిర్వహణలోని సోమరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధుల సహకారం తీసుకున్నాడు. ఒక మంచి పనికి వారిచ్చిన సహకారంతో తక్కువ సమయంలోనే తాననుకున్న పనిని ఆచరణలో పెట్టగాలిగాడు. పూతరేకులు, చికెన్ ఆవకాయ వంటి నాలుగు రకాల వంటకాలను రిషి ఎన్నుకున్న మహిళలు తయారు చేశారు.

ఉత్పత్తులు రెడీ. మరి వాటిని ఎలా అమ్ముకోవాలి? దానికి మార్కెటింగ్ ఎలా చేయాలి? దీనికోసం రిషి ప్రముఖ పర్యాటక రంగ సంస్థ థామస్ కుక్ తో కల్సి వారి సహాయంతో ట్రూ ఇండియా అనే హోటల్స్ ద్వారా ఆ ఉత్పత్తుల అమ్మకాలను సాగించాడు. అలా చిన్నగా మొదలు పెట్టిన రిషి..తరువాత అవే ఉత్పత్తులను మరికొంతమంది మహిళలతో చేయించేలా చేశాడు. అలా ఆ ప్రాంతంలో చాలా మంది మహిళలను ఈ స్వయంకృషి లో భాగస్వాములను చేశాడు. వారందర్నీ గ్రూపులుగా చేసి ఆ గ్రూపులకు లీడర్లను ఏర్పాటు చేసి ఆయా మహిళలు వారి ఖాళీ సమయాల్లో ఈ ఉత్పత్తులను చేసి ఇచ్చేవిధంగా కార్యక్రమాన్ని రూపొందించాడు. ప్రస్తుత్తం స్వయంకృషి కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతంలోని మహిళలు ఆర్థికంగా నిలదోక్కుకోగాలిగారు.అవును మరి ఐక్యరాజ్యసమితి '';ఫ్యూచర్ లీడర్'' కార్యక్రమంలో మన దేశ బావుటాను ఎగురవేసిన స్వయంకృషి పథకం లో భాగాస్వాములయ్యాకా ఆర్ధిక స్వావలంబన దక్కకుండా ఉంటుందా?

మొత్తమ్మీద ఇప్పుడు కాళ్లకూరు ప్రాంతంలో రిషివర్మ నేర్పిన స్వయంకృషి సోమరాజు ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ముందుకు వెళుతోంది విజయవంతంగా. ఆపైన రిషి సంకల్పానికి అంతర్జాతీయస్థాయిలో వచ్చిన గుర్తింపూ మరింత ముందుకు పోవడానికి సోపానంల ఉపయోగపడుతోంది. పద్నాలుగేళ్ళ బాలునికి వచ్చిన ఆలోచనను ఆకతాయి తనంగా తీసిపారేయకుండా..వెనుక ఉండి ముందుకు నడిపించిన రిషివర్మ కుటుంబ పెద్దలూ ఈ అంతర్జాతీయ గౌరవానికి అర్హులే!

ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ లో మరింత విస్తృత పరచాలని రిషివర్మ అనుకుంటున్నాడు. ఈ దిశలో తన సెలవు రోజుల్లో ప్రయత్నాలను చేస్తున్నట్టు రిషి వివరించాడు. ''ఈ కార్యక్రమం మన దేశంలోని వారికే కాదు.. అన్ని దేశాల ప్రజలకూ ఉపయుక్తంగా ఉంటుంది. ఆహార ఉత్పత్తులే కాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకత కలిగిన అంశాల ఆధారంగా ఇటువంటి కార్యక్రమాలను రూపొందిస్తే అందరికీ ఆర్ధిక భరోసా దొరుకుతుంది'' అంటున్న రిషి వర్మ ఐక్యరాజ్య సమితి కోసం రూపొందించిన స్వయంకృషి కార్యక్రమం ప్రాజెక్ట్ వివరాలు ఈ కింది వీడియోలో మీరూ చూసేయండి!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories