ఆ ఆరుగురే బాధ్యులు..హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

జోగులాంబ గద్వాలకు చెందిన గర్భిణి మృతి ఘటనలో బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టులకు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Update: 2020-05-27 06:15 GMT
Telangana High Court (file Photo)

జోగులాంబ గద్వాలకు చెందిన గర్భిణి మృతి ఘటనలో బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టులకు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీని నియమించినట్టు తెలిపారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గర్భిణి జెనీలాకు వైద్యం నిరాకరించిన వ్యవహారంలో ఆరుగురు వైద్యులను బాధ్యులుగా గుర్తించినట్టు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్యులను, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు చెందిన ఒకరిని బాధ్యులుగా గుర్తించినట్టు స్పష్టం చేసారు.

గర్భిణి ఆస్పత్రికి వచ్చిన సమయంలో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో వైద్యులు గర్భిణిని చేర్చుకుని ఉంటే ఆమె బతికేదని కమిటీ అభిప్రాయపడినట్టు పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలను సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా చేపడుతామని హైకోర్టుకు వెల్లడించారు. ఈ సంఘటన అనంతరం 65 మంది సభ్యులతో స్టేట్‌ ప్రెగ్నెన్సీ మానిటరింగ్‌ సెల్‌ను ప్రసూతి వైద్యసేవల పర్యవేక్షణకు ఏర్పాటుచేసామన్నారు. 67,527 కాన్పులకు తేదీలను లాక్‌డౌన్‌ సమయంలో ఇవ్వగా 58,880 డెలివరీలు చేసామని తెలిపారు. మే 30 లోపు కాన్పు తేదీ ఉన్నవారికి అంబులెన్స్‌లను కేటాయించి, అంబులెన్స్‌ కాంటాక్ట్‌ నంబర్లను కూడా అందజేస్తున్నామన్నారు. '102'వాహనాలు 300,'108'వాహనాలు 333 డెలివరీ, డెలివరీ తర్వాత రవాణా, వైద్యసేవలను గర్భిణులకు వైద్యం కోసం మైక్రో యాక్షన్‌ ప్లాన్‌ అమలుచేస్తున్నామన్నారు.


Tags:    

Similar News