చేతులెత్తేసిన సౌతాఫ్రికా.. పాకిస్తాన్ ఘన విజయం

Update: 2019-06-23 17:30 GMT
Pak win against south afrika

రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన అవసరం ఉన్న మ్యాచ్. ఒక జట్టుకి పోయిన ప్రతిష్టని తిరిగి తెచ్చుకోవాలనే తపన.. మరోజట్టుకి ముందడుగు వేయాలంటే తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి. సమానమైన ఒత్తిడితో రెండు జట్లూ తలపడ్డాయి. కానీ, ప్రతిష్ట కోసం చేసిన పోరే విజయాన్ని అందుకుంది. ఆ జట్లే పాకిస్తాన్, సౌతాఫ్రికా.. రెండు జట్లూ హోరా హోరీ తలపడతాయనుకున్నారు అభిమానులు. అయితే, వార్ వన్ సైడ్ అయిపొయింది. వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు రెండు జట్ల మధ్య జరిగిన పోరులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచ బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు సమిష్టిగా ఆడి.. ఏడు వికెట్లకు 308 పరుగులు చేసింది. ప్రతిగా బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు ఏ దశలోనూ గెలుపు కోసం ఆదినట్టుగా కనిపించలేదు. నత్త నడక బ్యాటింగ్ తో చివర్లో చూసుకోవచ్చనే ఆలోచనతో సాగినట్టనిపించింది.

లక్ష్య సాధనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. అమీర్ తానూ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఆమ్లా ను ఎల్బీగా అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన డికాక్ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. ఆచి తూచి ఆడుతూ వికెట్ పడకుండా చూశాడు. మరోవైపు డుప్లిసిస్ తనదైన శైలిలో ఆడాడు. 20 వ ఓవర్లో డీకాక్ షెదాబ్‌ బౌలింగ్‌లో ‌(47; 60బంతుల్లో ) పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత వచ్చిన మార్క్రమ్ 7 పరుగులు చేసి ఇన్నింగ్స్ 24వ ఓవర్లో షెదాబ్‌ చేతిలో బౌల్డ్‌ అయ్యాడు. 26వ ఓవర్లో డుప్లిసిస్ తన అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే, జట్టు స్కోరు మాత్రం నిదానంగానే సాగుతూ వచ్చింది. 30 వ ఓవర్లో ఆమిర్‌ బౌలింగ్‌లో మూడో బంతిని భారీ షాట్‌ ఆడిన డుప్లెసిస్‌(63; 79బంతుల్లో) వికెట్‌కీపర్‌ సర్ఫరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో దాదాపుగా సౌతాఫ్రికా ఓటమి అయిపొయింది. మరో పది ఓవర్ల వరకూ మిల్లర్, డసెన్ వికెట్ పడకుండా ఆడుతూనే పరుగులూ రాబట్టారు. కనీ అవి విజయానికి అవసరమైనంతగా రాలేదు. 40వ ఓవర్లో షెదాబ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి డసెన్‌(36; 47బంతుల్లో) హఫీజ్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లోనే షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఐదో బంతికి మిల్లర్‌(31; 37బంతుల్లో) క్లీనబౌల్డ్‌ అయ్యాడు. ఇక్కడితో పోరాటం ముగిసినట్టయింది. అటుతరువాత పరుగుల అంతరం తగ్గించడానికే ఆడిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఎక్కడా బంతిని బాడే ప్రయత్నం కూడా చేయలేదు. 45వ ఓవర్లో వాహబ్‌ బౌలింగ్‌లో రెండో బంతికి మోరిస్‌(16; 10బంతుల్లో) ఔటయ్యాడు. 47 వ ఓవర్లో వాహబ్‌ బౌలింగ్‌లో రబాడ(3) పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు ఎనిమిది వికెట్లకు 239 పరుగులు. ఇక దక్షిణాఫ్రికా పరాజయం లాంచనం అయిపొయింది. చివరకు 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది సౌతాఫ్రికా. పాకిస్తాన్ జట్టు 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Tags:    

Similar News