Karnataka Kukke Subramanya Swamy Temple:వశీకరించబడిన గరుడ స్తంభం ఉన్న ఆయలం ఎక్కడ ఉందో తెలుసా...

Karnataka kukke subramanya swamy temple: అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కే దేవస్థానం కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి.

Update: 2020-06-28 08:43 GMT

Karnataka Kukke Subramanya Swamy Temple: అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రమణ్య గ్రామములో కుక్కే దేవస్థానం కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. దేవస్థానం ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో ఎక్కడ చూసిన దాదాపుగా ఇదే వాతావరణం కనిపిస్తుంది. గ్రామ నడిబొడ్డున దేవస్థానం ఉంటుంది. చుట్టూ మనోహరమయిన జలపాతాలు, అడవులు, కొండలు ఉండటమువలన ఇది ఒక ప్రకృతి అద్భుతము అని చెప్పవచ్చును. సుబ్రమణ్య గ్రామానికి పూర్వంలో కుక్కే పట్టణం అని పేరు ఉండేది. తన దిగ్విజయధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆది శంకరాచార్యూలవారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్టు "శంకర విజయం" చెప్తున్నది. శంకరాచార్యుల "సుబ్రమణ్య భుజంగప్రయత స్తోత్రం"లో ఈ ప్రదేశాన్ని "భజే కుక్కే లింగం"గా ప్రస్తావించారు. స్కంధ పురాణ సనాతకుమార సంహిత లోని సాహ్యద్రఖండ తీర్తక్షేత్ర మహమనిపురణ అధ్యాయంలో శ్రీ సుబ్రమణ్య క్షేత్రం గురించి అద్భుతంగా అభివర్ణించారు. కుమార పర్వత శ్రేణి నుండి ఉద్బవించు ధారా నది ఒడ్డున శ్రీ క్షేత్రం కొలువై ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్ప దేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి, ఇతర సర్పాలు సుబ్రమణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి.

భౌగోళికం నేపథ్యం..

శ్రీ కుక్కే సుబ్రమణ్య క్షేత్రం కర్నాటక లోని సుందరమయిన పశ్చిమ కనుమలలో ఉంది. దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్దమైన కుమారపర్వతం ఉంది. దక్షిణ భారత పర్వతారోహులకు కుమారపర్వతము ఎంతో ఇష్టమైన ప్రదేశం. దేవస్థాన ప్రవేశ మార్గానికి ఈ పర్వతం వర్ణనాతీథమైన అందాన్ని తెచ్చి పెట్టింది. దేవస్థానాన్ని పడగ విప్పి కాస్తున్న ఆరు సర్పాల కాల నాగు పాము (శేష పర్వతం) వలె ఉంటుంది. ఈ దేవస్థానం పశ్చిమ కనుమల పశ్చిమవైపు వంపులలో దట్టమయిన పచ్చని అడవులతో కప్పబడి ఉంటుంది.

దేవస్థానం విశేషాలు..

శ్రీ క్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమారధార నదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రమణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీ. దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. మూలవిరాట్కు ముఖ ద్వారానికి మధ్య వెండి తాపడం చెయ్యబడిన గరుడస్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, లోపల నివాసం ఉన్న మహా సర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకీలల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడిందిఅని నమ్మకం. స్తంభం తరువాత బాహ్య మందిరం, అంతర మందిరం, సుబ్రమణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రమణ్య స్వామి, వాసుకిల విగ్రహాలు, కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు నిత్య కర్మ ఆరాధన పూజలు జరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి, ప్రజధరణ పొందుతున్నది.

చరిత్ర...

ఒక పురాణానుసారం, షణ్ముఖ ప్రభువు తారక, శూరపద్మసుర అను రాక్షసులను వారి అనుచరుల సమేతంగా సంహరించి తన సోదరుడు గణేషుణితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడ ఇంద్రుడు గొప్ప ఆహ్వానం పలుకుతాడు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు, కుమారస్వామిని తన కుమార్తె దేవసేనను మనువు ఆడామని అడుగుతాడు. దానికి వెంటనే సానుకూలతను తెలియచేస్తాడు. వారి వివాహం కుమార పర్వతం పైన మృఘశిర మాసం శుద్ధశష్టి నాడు జరుగుతుంది. ఆ వివాహంతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిశేఖానికి దేవదేవులు బ్రహ్మ, విష్ణు, రుద్రాడి దేవతలు ఆశీర్వాదాలు అందచేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్థ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకన్ని నిర్వహించారు. అలా ఆ పుణ్య నదుల కలియక నుంచి ప్రవహించిన ధార నేడు కుమారధారగా పిలవబడుచున్నది. గరుడునిధాడి నుంచి తప్పించుకోవటానికి సర్ప రాజు వాసుకి కుక్కే సుబ్రమణ్య క్షేత్రము లోని బిల ద్వారా గుహలలో శివ తపస్సు చేస్తుంటాడు. వాసుకి తపస్సుకు ప్రసన్నిన్చిన శివుడు, షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకికి అండగా, తోడుగా ఉండమని చెపుతాడు. అందుకే, వాసుకికి కానీ నాగరాజుకు కానీ చెయ్యబడే పూజలు సుబ్రమణ్య స్వామి వారికి చేసినట్టే. మొదట్లో ఈ దేవస్థానం పూజా, శుధి బాధ్యతలు స్థానిక మొరోజా తుళు బ్రాహ్మణులు చూసేవారు. 1845 తరువాత నుంచి వాటిని మధ్వా (శివల్లి) బ్రాహ్మణులు చూస్తున్నారు.

ఆశ్లేష బలి పూజ..

శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము, కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు. ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. ఈ పూజ బ్యాచ్లలో రెండు సమయాలలో జరుపుతారు. మొదటిది 7:00 కు, రెండవది 9:15 కు మొదలవుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమ తమ బ్యాచ్ ప్రారంభ సమయానుసారం దేవస్థానం లోపల సంకల్పం చేసే పురోహీతుడి ముందు హాజరు కావలెను. హోమ పూర్ణహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.

సర్ప సంస్కార / సర్ప దోష పూజలు...

సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణనుసారం, ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష బాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉందని చెపుతుంటారు. సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పుజను ఒక వ్యక్తి కానీ, తన కుటుంబంతో కానీ, లేక పూజారి గారి ఆద్వర్యంలో కానీ చెయ్యవచ్చును. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శార్డం, తిథి, అంత్యక్రియ పూర్వ పూజలలా ఉంటుంది. సార్పాసాంస్కార పూజ చెయ్య దలిచిన భక్తులు రెండు రోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ సూర్యోదయం చెయ్యబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. ఈ పూజా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని నలుగురుకి దేవస్థానం వారు భోజన సదుపాయం కలిపిస్తారు.

క్షేత్రానికి వెళ్లే మార్గం..

సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉంది. తీర పట్టణము అయిన మంగళూరు నుండి 105కి.మీ. దూరంలో ఈ దేవస్థానం ఉంది. మంగళూరు నుండి రైలు, బస్సు, ట్యాక్సీల ద్వారా దేవస్థానాన్ని చేరుకోవచ్చు.





Tags:    

Similar News