Appalaya Gunta Sri Venkateswara Temple History: అప్పలాయ గుంట ఆలయ రహస్యం

Appalaya Gunta Sri Venkateswara Temple History : ఏడు కొండలపై వెలసిన ఆపద మొక్కులు తీర్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి.

Update: 2020-07-22 07:15 GMT
అప్పలాయ గుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

Appalaya Gunta Sri Venkateswara Temple History: ఏడు కొండలపై వెలసిన ఆపద మొక్కులు తీర్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.

స్థల పురాణం

శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంది.

ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.

పేరువెనుక చరిత్ర

ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్ధం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడినదని కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తలుస్తుంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసినవారికి కూలి అప్పు చెప్పకుండా ఏరోజుకు ఆరోజే ఇచ్చేవాడని అందుకనే ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది.

ఈక్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.




Tags:    

Similar News