Puri Rath Yatra 2021: పూరీ జగన్నాథ రథయాత్ర షురూ...బట్ నో ఎంట్రీ

Puri Rath Yatra 2021: కరోనా నిబంధనలకు అనుగుణంగా ఒడిశాలోని పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ప్రారంభం అయ్యింది.

Update: 2021-07-12 03:43 GMT

Puri Jagannath Rath Yatra:(The Hans India)

Puri Rath Yatra 2021: ఒడిశాలోని పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర కు సర్వం సిద్ధం అయ్యింది. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా సంక్షోభం కారణంగా జగన్నాథ యాత్రకు పూరీలో మాత్రమే నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పూరీ మినహా మిగిలిన ప్రాంతాల్లో రథయాత్రల్ని అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకలను భక్తులు ఇళ్లల్లో కూర్చొని చూడాలని పేర్కొంది. ఇక, మూడు రథాలు శ్రీక్షేత్ర కార్డన్‌లో నిలిచిన తర్వాత భద్రతా బలగాలను నియమించారు.

దీంతో కరోనా నిబంధనల మేరకే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాలపై గుండిచా మందిరానికి చేరుకోనున్నారు. రథాలను సేవలకు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని దక్షిణాభిముఖంగా శ్రీక్షేత్రం ఎదుట నిలిపారు. శ్రీక్షేత్ర కార్యాలయం ఎదుట అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైన రథాల తయారీ పనులు.. ఆదివారంతో ముగిసాయి.

కీలకమైన 'సేనాపట' సేవను దైతాపతి సేవాయత్‌లు నిర్వహించారు. మరోవైపు పురుషోత్తముని నవయవ్వన వేడుకలు జరుగుతున్నాయి. స్వర్ణాభరణాలతో ముగ్గురు మూర్తులను అలంకరించారు. మహాప్రసాదం, మరో 56 రకాల పిండి వంటకాలు స్వామికి అర్పణ చేశారు.మరోవైపు, పూరీ పట్టణంలోకి ఎవరూ ప్రవేశించకుండా అన్ని దారులనూ మూసివేశారు. ఎటుచూసినా బలగాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రాకపోకలు రద్దు చేశారు. పూరీ రథయాత్రకు 500 మంది అధికారులు, 65 ప్లటూన్ల భద్రతా బలగాలను నియమించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒడిశా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది.

Tags:    

Similar News