ఇంటి ఓనర్ బయటకు గెంటేస్తే ఏం చేశాడో చూడండి..

Update: 2019-06-19 08:08 GMT

ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. ఓనర్ బయటకు గెంటేశాడు. బయటేమో విపరీతమైన చలి. ఒకపక్క బాధ.. మరోపక్క ఎక్కడ తలదాచుకోవాలో తెలీని స్థితి.. ఈ పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారు. అప్పుకోసం ప్రయత్నిస్తారు. ఎవరిదగ్గరన్నా బిచ్చమెత్తుతారు. కానీ, ఇంగ్లాండ్ లో ఓ పెద్దాయన మాత్రం భిన్నంగా ఆలోచించాడు. మేనెల 25 వ తేదీన ఇంగ్లండ్ లోని బౌర్నేమౌత్ ప్రాంతానికి చెందిన లౌరెన్స్ జేమ్స్ వండర్ డెల్ అద్దె చెల్లించలేకపోవడంతో ఓనర్ ఇంటిని ఖాళీ చేయించాడు. దీంతో నిలువనీడ లేకుండాపోయిన జేమ్స్.. ఎక్కడయినా ఆశ్రయం పొందాలని భావించాడు. అనుకున్నదే తడవుగా అరటిపండును కొనుగోలు చేసి ఓ నల్లటి కవర్ కప్పాడు. అనంతరం గత నెల 25న నేషనల్ వైడ్ బ్యాంకుకు వెళ్లాడు. అయితే అక్కడ కస్టమర్లు ఎక్కువగా ఉండటంతో బౌర్నేమౌత్ లోని బర్క్లేస్ బ్యాంకు బ్రాంచ్ కు చేరుకున్నాడు. క్యాషియర్ దగ్గరకు మర్యాదగా వెళ్లి కవర్ కప్పిన అరటిపండును అతనివైపు గురిపెట్టాడు. 'నా దగ్గర తుపాకీ ఉంది.. మర్యాదగా నగదు ఇవ్వు' అని హెచ్చరించాడు. దీంతో ఆ క్యాషియర్ 1000 పౌండ్లను కవర్ లో పెట్టి ఇచ్చేశాడు. దాన్ని తీసుకున్న జేమ్స్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి మొత్తం విషయం చెప్పాడు.

ఇక్కడ మన ఇండియా లో లానే.. ఛ ఆ బ్యాంక్ మా పరిధిలోకి రాదు.. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు జేమ్స్ కు సలహా ఇచ్చారు. దీంతో నిందితుడు స్వయంగా వెళ్లి స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. జైలులో అద్దె చెల్లించకుండా ఆశ్రయం పొందవచ్చన్న ఆశతోనే దొంగతనం చేశానని జేమ్స్ చెప్పిన మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన జడ్జి రాబర్ట్ పాసన్ జేమ్స్ కు 14 నెలల జైలుశిక్ష విధించారు. ఈ విధంగా మన హీరోకి ఆశ్రయం దొరికింది.

Tags:    

Similar News