Coronavirus: దేశవ్యాప్తంగా కదం తొక్కుతున్న కరోనా.. 613 కు పెరిగిన కేసులు!

* బుధవారానికి 613కి పెరిగిన కేసులు * సైనిక ఆసుపత్రుల్లో పడకలూ రోగులకు అందుబాటులో * పరిస్థితిని సమీక్షించిన కేంద్రం * మొత్తం మృతుల సంఖ్య 10

Update: 2020-03-26 01:11 GMT
coronavirus

దేశంలో కరోనా (కొవిడ్‌-19) కేసుల ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. మంగళవారం వరకు 523 మంది కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 613కి చేరింది. ఇక మృతుల సంఖ్యలో మార్పు లేదు. ఒకేసారి ఇన్ని పాజిటివ్‌ కేసులు రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఆసుపత్రుల్లో అదనపు పడకల్ని సిద్ధం చేయించాలని నిర్ణయించి, తక్షణం ఆ ఏర్పాట్లు ప్రారంభించింది. సైనిక, కేంద్ర పారామిలిటరీ బలగాల ఆసుపత్రులకు చెందిన 1890 పడకలను కరోనా బాధితుల కోసం అత్యవసరంగా కేటాయించింది. హైదరాబాద్‌, బెంగళూరు సహా వేర్వేరు ప్రాంతాల్లో 32 ఆసుపత్రుల్లో ఈ పడకలు ఉన్నాయి.

దేశంలో ఇంతవరకు 10 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించినా దిల్లీలో ఒక వృద్ధుడి కన్నుమూతకు కరోనా కారణం కాదని తేలాక ఆ మేరకు అంకెను సవరించింది. మహారాష్ట్రలో మూడో వ్యక్తి మరణించినట్లు ముంబయి నగరపాలక సంస్థ చేసిన ప్రకటననూ కేంద్రం పరిగణనలో తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులోని మదురైలో ఒకరు (54 ఏళ్ల పురుషుడు), మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒకరు (65 ఏళ్ల మహిళ) బుధవారం కరోనాతో చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య మళ్లీ పదికి చేరింది.

ఉల్లంఘనలపై కేసులు నమోదు..

ప్రధాని పిలుపునిచ్చిన మేరకు దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్‌ బుధవారం నుంచి ప్రారంభమయింది. నిత్యావసరాల కోసం ప్రజలు పలుచోట్ల బారులు తీరారు. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వందల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నవరాత్రి ఉత్సవాలకు పలువురు భక్తులు నేరుగా హాజరుకాకుండా తమ పేర్లను ఫోన్ల ద్వారా పూజారులకు చెప్పి, పూజలు చేయించుకున్నారు. 

Tags:    

Similar News