ముంబైలో ఘోర ప్రమాదం.. కూలిన 'కసబ్‌' బ్రిడ్జి

Update: 2019-03-15 01:13 GMT

ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ) నుంచి అంజుమన్‌ కాలేజీ, టైమ్స్‌ ఆప్‌ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను 'కసబ్‌ బ్రిడ్జి'గా వ్యవహరిస్తారు.

2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్‌ షిరాద్‌ ఖాన్‌(32), టి.సింగ్‌(35)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సింది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

Similar News