అయోధ్య పై సుప్రీం కీలక తీర్పు నేడే!

134 సంవత్సరాల అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించడానికి సిద్ధమైంది.

Update: 2019-11-09 02:45 GMT
high alert due to Judgement on Ayodhya case

ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమైంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం పై ఈరోజు (శనివారం-09-11-2019) ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో శుక్రవారం రాత్రి సమాచారం ఇచ్చారు. రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అయోధ్య భూ వివాదంపై కీలక తీర్పు చెప్పనుంది. అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా 40 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు వింది. అనంతరం అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో పెడుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు ఈ అంశంపై తీర్పు ఇవ్వనున్నట్టు వెబ్ సైట్ లో ప్రకటించింది.

దేశమంతా హై అలర్ట్..

సుప్రీంకోర్టు లో అయోధ్య వివాదం పై వాదనలు ముగిసిన దగ్గర నుంచీ దేశంలోని అన్ని ప్రధాన నగరాలలోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అన్ని నగరాల్లోనూ శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. రెండు మతాల మధ్య నెలకొన్న వివాదం కావడం.. సున్నితమైన విషయం కావడంతో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు..

అయోధ్య తీర్పు నేపధ్యంలో ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే క్యాబినెట్ మంత్రులకు సూచించారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ తీర్పు వెలువడిన తర్వాత రెచ్చగొట్టే విధమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సోషల్ మీడియా వినియోగదారులకు పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. 


Tags:    

Similar News