West Bengal: బెంగాల్ సీఎం మమతాకు సీబీఐ షాక్

West Bengal: బెంగాల్‌లో ఎన్నికల తర్వాత వేడెక్కిన రాజకీయం

Update: 2021-05-17 10:12 GMT

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఇమేజ్)

West Bengal: బెంగాల్‌లో ఎన్నికల అనంతరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హ‌కీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

2016 అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ను కుదిపేసిన నారద టేపుల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలం సద్దుమణిగిందనుకున్న ఈ కేసుపై సీబీఐ విచారణకు గవర్నర్ అనుమతించి వివాదానికి తెరతీశారు. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు ఇద్దరు మంత్రులను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

గత ఎన్నికల ముందు నారద టేపుల వ్యవహారం బెంగాల్‌ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో మంత్రి ఫిర్హాద్ హకీమ్‌ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద టేపుల వ్యవహారంపై విచారణకు సీబీఐకి అనుమతించారు. నారద టేపుల కుంభకోణం కేసులో గత క్యాబినెట్‌లోని నలుగురు మంత్రుల పాత్రపై విచారణకు బీజేపీ డిమాండ్ చేయడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంలో అప్పటి టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ కుంభకోణంపై కమిషన్ నియమించే సమయానికి సువేందు తృణమూల్ ఎంపీగా ఉన్నారు. 2014లో ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చిన ఓ జర్నలిస్ట్.. తనను తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నారు. బెంగాల్ పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నామని, దీనికి సహకరించాలని ఏడుగురు టీఎంసీ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ పోలీస్ అధికారికి కొంత మొత్తం ఇచ్చినట్టు టేపులు బయటకు వచ్చాయి.

Tags:    

Similar News