ఈ ఏడాది చివరి వరకూ ఆయనే!

Update: 2019-06-14 01:43 GMT

విజయాల వరమాలను వేయించే వాళ్ళని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందులోనూ రాజకీయాల్లో.. అవసరమైతే రూల్స్ మార్చైనా సరే.. పార్టీ అవసరాల దృష్ట్యా అంటూ రెండేంటి.. ఇంకా ఎన్ని పదవుల్లోనైనా కొనసాగిస్తారు. ఇపుడు బీజేపీ పరస్థితి అదే. అమిత్ షా దేశంలో నెంబర్ టూ గా పేరు సాధించిన నేత. ఈయన రాజకీయ వ్యూహాలతోనే బీజేపీ ఎన్నికల్లో విజయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల వ్యూహాల్ని అమలు చేయడంలో బీజేపీలో ఇంతవరకూ అటువంటి నాయకుడు లేదంటే అతిశయోక్తి కాబోదు. అందుకే అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా గత డిసెంబర్ లోనే పదవీకాలం ముగిసినా.. ఎన్నికలయ్యేంత వరకూ పదవిని పొడిగించారు. ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అమిత్ షా దేశ హోం మంత్రిగా పదవినీ చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవికి కొత్తవారిని ఎన్నుకుంటారని కొంత కాలంగా ప్రచారం జరిగింది. సీనియర్ నాయకుడు జేపీ నడ్డా కొత్త అధ్యక్షుడు కావచ్చని దాదాపుగా అంతా భావించారు. కానీ, ఈ ఐదేళ్లలో బీజేపీ చీఫ్ గా కాషాయ దళాన్ని సమర్థవంతంగా నడిపించిన అమిత్ షా ఈ ఏడాది చివరివరకు అవే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆ తర్వాత 2019 డిసెంబరులో కానీ, 2020 ఆరంభంలో కానీ బీజేపీ కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే అవకాశాలున్నాయి.

ఈ ఏడాది హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో అమిత్ షా వ్యూహ చతురత బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో, మూడు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షానే కొనసాగించాలని మోదీ సహా అగ్రనేతలందరూ అభిప్రాయపడినట్టు చెప్పుకుంటున్నారు. 

Tags:    

Similar News