ఏపీ ఎన్నికల్లో తమిళ ఓటర్లూ కీలకమే

Update: 2019-04-02 15:53 GMT

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు అసెంబ్లీ, లోక్ సభ స్థానాలలో తమిళభాష మాట్లాడే ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. సత్యవేడు, నగరి, చిత్తూరు, పలమనేరు,కుప్పం నియోజకవర్గాల అభ్యర్థుల జయాపజయాలను తమిళతంబీలో నిర్ణయించనున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ, 25 లోక్ సభ నియోజకవర్గాలకు మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగు భాష మాట్లాడే ఓటర్లతో పాటు తమిళం మాతృభాషగా కలిగిన ఓటర్లు సైతం కీలకపాత్ర పోషించబోతున్నారు. తమిళనాడురాష్ట్ర సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో తమిళ ఓటర్ల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అవకాశాలు లేకపోలేదు. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు తూర్పు ప్రాంతంలో సత్యవేడు, నగరి, జీడీ నెల్లూరు, పశ్చిమ ప్రాంతంలో చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలున్నాయి.

వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే రోజా ప్రధాన అభ్యర్థిగా ఉన్న నగరి నియోజకవర్గంలో 1.92 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో సుమారు 60 వేల మంది తమిళులే కావటం విశేషం. అంతేకాదు సత్యవేడు నియోజకవర్గంలోని లక్షా 72వేల ఓటర్లలో 55 వేలమంది తమిళులే ఉన్నారు. మరోవైపు నెల్లూరు నియోజకవర్గంలో 45 వేలు,చిత్తూరు నియోజకవర్గంలో 60 వేల తమిళ ఓట్లున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దునే ఉన్న పలమనేరు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంనియోజకవర్గంలో 10 వేలమంది చొప్పున తమిళ ఓటర్లు ఉన్నారు.

నగరి, సత్యవేడు నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు, నారాయణవనం మండలాల్లో డైయింగ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ. చేనేత కార్మికులు సైతం ఎక్కువే.రెండు వర్గాల మొదలియార్‌లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వారి ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చేనేత కార్మికులను, ప్రధానంగా మొదలియార్ లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం మీద చిత్తూరు జిల్లాలోని అరడజనుకు పైగా నియోజకవర్గాల భవితవ్యం తమిళ ఓటర్ల చేతిలోనే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Similar News