ఆసక్తి కలిగిస్తున్న మదనపల్లె ఓటరు నాడి...సెంటిమెంట్‌ తలచుకుని తెలుగు తమ్ముళ్ల డీలా

Update: 2019-05-10 14:33 GMT

ఆంధ్రా ఊటిలో హీట్ పెరుగుతోంది. కూల్‌గా ఉండే ఆ ప్రాంతంలో పొలిటికల్ కాక రేగుతోంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మదనపల్లెలో ఎవరు గెలుస్తారన్నది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఓటరు నాడి అంతుచిక్కక పోవడంతో నేతల్లో టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిసారి వైవిధ్యమైన తీర్పిచ్చే మదనపల్లె ఓటరు, ఈసారి డిసైడ్ చేసిందేంటి?

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ, రెండవ పర్యాయం గెలవలేదు. 1983వ సంవత్సరంలో రాటకొండ నారాయణ రెడ్డి గెలిచి, ఆ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ప్రభుత్వం పడిపోతే, తిరిగి 1985 ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచారు. అంతకుముందు, ఆ తరువాత ఎవ్వరూ సెకండ్‌ టైమ్ గెలిచిన దాఖలాలు ఇక్కడ కనబడవు. కమ్యూనిస్టులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచిన ప్రాంతమిది. రాష్ర్టంలో తెలుగుదేశం ఆవిర్భావం తరువాత పరిస్థితులు గమనిస్తే, ఈ సారి మదనపల్లె ఓటర్లు ఎవరిని గెలిపిస్తారనేది సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది.

2014లో వైసీపీ బరిలోకి వచ్చింది. టీడీపీ, బీజేపీ అలయన్స్ కుదరడంతో టీడీపీ ఆ సీటును బీజేపీకి కేటాయించింది. దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ నుంచి గెలుపొందాడు. అయితే, ఈసారి ఆ‍యనకు టికెట్ దక్కలేదు. అభ్యర్థిని మార్చింది వైసీపీ. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలుపొందిన దేశాయ్ తిప్పారెడ్డికి లాస్ట్ మినిట్ లో హ్యాండిచ్చి, ముస్లిం అభ్యర్థి నవాజ్‌ భాషాను రంగంలోకి దింపింది. 2009లో కాంగ్రెస్‌లో, వైఎస్‌ హవాలో మాత్రమే అక్కడ నుంచి ముస్లిం అభ్యర్థి గెలిచాడు. అలాంటిది సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటివ్వకుండా ముస్లిం అభ్యర్థికి సీటివ్వడంతో ఎంత వరకు లాభిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీ మీద గుర్రుగా ఉన్నాడు. దీంతో ఆ పార్టీకి ఇదో పక్క పోటుగా మారే అవకాశమూ లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

ఈసారి టీడీపీ మాత్రం గతంలో గెలిచిన దొమ్మలపాటి రమేష్‌ను రంగంలోకి దింపింది. 1994లో ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత మదనపల్లెలో టీడీపీ గెలవలేదు. మూడో పర్యాయం గెలుపు కోసం ఆరాటపడుతోంది టీడీపీ. ఇది ఎంత వరకు లాభిస్తుందన్నది మాత్రం వేచి చూడాలి. అదే సమయంలో గతంలో ఇదే వ్యక్తిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గంగారపు రాం ప్రసాద్, ఆ తరువాత టీడీపీలో చేరారు. అయితే తనకు టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన సతీమణిని జనసేన నుంచి పోటీకి దింపారు. అటు సెంటిమెంటుగా చూసినా ఇటు పొలిటికల్‌గా చూసినా, తమ్ముళ్లు టెన్షన్‌కు తప్పేలా లేదన్నది లోకల్‌ టాక్.

అయితే తెలుగుదేశంలో చీలికలు తమకు లాభిస్తాయని వైసీపీ భావిస్తోంది. గంగారపు రాం ప్రసాద్ టీడీపీ ఓట్లను చీల్చితే, వైసీకీ తప్పకుండా లాభపడుతుందన్న అంచనాలో వారున్నారు. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటివ్వకపోవడంతో ఆయన వర్గం తమకు సహకరించిందన్న ధీమాలో టీడీపీ వారున్నారు. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. సెంటిమెంటు ప్రాధాన్యతలను చూసినా, రాజకీయ సమీకరణలు చూసినా, ఇక్కడ ఓటరు నాడి పట్టడం కష్టంగా మారింది. అయితే టీడీపీ, వైసీపీ మాత్రం ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. గెలుపు తమదేనన్న తమ విశ్వాసానికి కచ్చితమైన లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఎవరు గెలిచినా మదనపల్లె రాజకీయ పుఠాలో మరో అధ్యాయంగా మారడం మాత్రం ఖాయం.

Full View 

Similar News