ఐటీగ్రిడ్స్‌ కేసు: ఏపీ ఎన్నికల అధికారి, ఇతర శాఖలకు నోటీసులు

Update: 2019-03-27 16:18 GMT

ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారితో పాటు సంబంధింత శాఖ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 22 కు వాయిదా వేసింది కోర్టు. ఐటీ గ్రిడ్ కేసు పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్ తరపు అడ్వకేట్ కొత్త వాదనను తెరమీదకు తీసుకొవచ్చారు. అసలు డేటా చోరీకి గురైందో లేదో తెలియాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతోపాటు మరి కొంతమందిని ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరారు.

అశోక్ తరపు అడ్వకేట్ వాదనపై ఐటీ గ్రిడ్ కేసు ఫిర్యాదుదారులు లోకేషన్ రెడ్డి, దశరథరామిరెడ్డి తరపు అడ్వకేట్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అనేక ఆధారాలు లభించాయని, ప్రధాన సూత్రధారి అశోక్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఎక్కడినుండి ఈ డేటా వచ్చిందో తెలుస్తుందన్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అధికారులను ఇంప్లీడ్ చేయనవసరం లేదని వాదించారు.

రెండు వర్గాల వాదనలు విన్న హై కోర్టు ఏపీ చీఫ్ ఎన్నికల అధికారి , ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల ఇంప్లీడ్ వ్యవహారం తో పాటు అశోక్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున పీపీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 22 కు వాయిదా వేసింది హైకోర్టు. 

Similar News