ఢిల్లీకి చంద్రబాబు..

Update: 2019-02-10 06:48 GMT

ధర్మ పోరాటాల దీక్షలు ఢిల్లీకి చేరాయి. హస్తిన వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం జరగనున్న దీక్ష కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌ ముస్తాబవుతోంది. విభజన హామీలు అమలు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష హస్తినకు చేరుకుంది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో నిర్వహించనున్న దీక్ష కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగనున్న దీక్ష కోసం రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

ఈ సందర్భంగా పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రధాన దీక్షా వేదిక దగ్గర పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రత్యక్ష ప్రసారాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తరలివచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. వీ వాంట్‌ జస్టిస్‌, ద స్ట్రగుల్‌ ఫర్ జస్టిస్‌, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పై హామీ నెరవేరలేదంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఆదివారం రాత్రి 7 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలా 15 నిముషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. తర్వాత 8 గంటల నుంచి దీక్ష ప్రారంభం అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయి పునర్విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివరిస్తారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తారు. 

Similar News