జనసేనతో పొత్తుపై టీజీ వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌. రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Update: 2019-01-23 07:30 GMT

టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌. రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వచ్చే మార్చ్‌ నెలలో రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కూడా జరుగుతాయని టీజీ వెంకటేశ్‌ హెచ్‌ఎంటీవీతో కుండబద్దలు కొట్టారు. పవన్‌ పార్టీకి, తమకూ మధ్య పెద్దగా విభేదాలు లేవని కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే విమర్శలు చేసుకున్నారు కానీ ఏ విషయంలోనూ తమ మధ్య మనస్పర్థలు లేవని టీజీ వెంకటేశ్‌ స్పష్టం చేశారు.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిందని విమర్శలు చేసుకున్న పార్టీలు చేతులు కలుపబోతున్నాయనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. త్వరలోనే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్‌ కనిపిస్తారని 2014 ఫార్ములాను మరోసారి రిపీట్‌ చేస్తారనే వాదనలు వినిపించాయి. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్‌ తమతో కలిసి రావాలంటూ ఆ మధ్య చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే అదే సమయంలో తాము వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పవన్‌ పార్టీ తేల్చిచెప్పింది. 175 స్థానాల్లో పోటీ చేస్తామని మరోసారి ప్రకటించింది. కానీ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ సమావేశం తర్వాత జనసేన వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు జరుగుతున్నాయంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లైంది.

అయితే ఇవాళ టీజీ వెంకటేశ్‌ హెచ్‌ఎంటీవీతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పర్మినెంట్‌ శత్రువులు, మిత్రులు ఉండరని యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు తామెందుకు కలవకూడదని ప్రశ్నించారు. కలిసి పనిచేస్తుంటే బాగుంటుందని పార్టీ నాయకుల్లో ఉందని టీజీ వెంకటేశ్‌ తెలిపారు.  

Similar News