పవన్‌కు సీపిఐ గుడ్ బై!?

Update: 2019-03-24 06:29 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రసవత్తంగా మారుతున్నాయి. ఇటు టీడీపీ, వైసీపీ ప్రచార జోరులో ఉన్నాయి. జనసేన కూడా దూసుకుపోతున్న వేళ జనసేనకు భారీ షాక్ తగలనుంది. జనసేన, వామపక్షాల మధ్య విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జనసేన, సీపిఐ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించడమే దీనికి కారణం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీరుపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన నూజివీడు అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీపీఐ పట్ల పవన్ అవమానకరంగా వ్యవహారించారని మండిపడుతున్నారు. నూజివీడు సీటు జనసేనకు మార్చడం వెనుక 50లక్షలు చేతులు మారాయని, ఇప్పడు ఎంపీ అభ్యర్థిత్వం వెనుక కూడా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను ఎన్నికల ప్రచార సామగ్రి సమకూర్చుకున్నానని, ఇప్పుడు హఠాత్తుగా జనసేన అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని సీపీఐ అభ్యర్థి చలసాని అజయ్‌కుమార్ ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలో రెండు చోట్ల బహిరంగ సభల్లో పవన్‌ స్వయంగా పాల్గొన్నారు. వీటికి సీపీఐ నేతలు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీపిఐ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సీపిఐ వర్గీయులు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీలోని కీలక నేతలంతా ఒంటరి పోరే మంచిదని సూచిస్తున్నట్లు సమాచారం. దీనిపై భవిష్యత్‌ కార్యాచరణను ఆదివారం ప్రకటించే అవకాశముంది.

Similar News