నిశ్శబ్ద విప్లవం

Update: 2019-05-23 09:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో నిశ్శబ్దం బద్దలైంది. ఓట్ల విస్ఫోటనం జరిగింది. కనీ, వినీ ఎరుగని చరిత్ర కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఉద్దండులు నిర్ఘాన్తపోయేలా.. రాజకీయాల్లో మేమే కింగులం అని తలలేగరేసే నేతల దిమ్మతిరిగేలా ఆంధ్రప్రజలు విస్తుకొలిపే విజయాన్ని వైసీపీకి కట్టబెట్టారు. ఏకపక్షం అనే పదం కూడా చిన్నదనిపించే విజయం ఇది. ఎపుడో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సృష్టించిన సంచలనాన్ని మించిన సంచలనం ఇది. 50 శాతానికి పైగా ఓట్లు ఓ పార్టీ.. అదీ ఓ ప్రాంతీయ పార్టీ సాధించడం రికార్డే. రాష్ట్రంలో సగానికి పైగా ఓటర్లు నిర్ద్వందంగా చంద్రబాబును కాదనుకున్నారు. ప్రజల విసుగు బయటకు కనబడదు. వారి విముఖతా స్వరం వినిపించదు. సమయం వచ్చినపుడు బయట పడుతుంది. అపుడు ఎవరికీ అవకాశాలు మిగలవు. సరిగ్గా ఇపుడు అదే జరిగింది. ప్రత్యర్థిని తక్కువ లెక్కేసిన వాళ్ళెవరూ గెలుపును సాధించలేరు. అది ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. డబ్బు.. కులం.. ఆరోపణలు.. నిందలు.. ఎన్ని ఎలా ఉన్నా.. ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని ప్రయత్నించినా.. ప్రజలు తామనుకున్నది తాము చేశేశారు. అలుపెరుగని పోరాటం లో తండ్రికి తగ్గ తనయుడుగా తనని తానూ ప్రజలకు కొత్తగా పరిచయం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ విజయం సాధించారు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిత్యం శ్రమించిన ఓ యువ నాయకుడిలో తమ భవిష్యత్తును చూసుకున్నారు. తన లక్ష్యం కోసమే ఇంత కష్టపడ్డ వాడు తనను నమ్మిన ప్రజల సంక్షేమం కోసం ఎంత శ్రమించాగలడో అని భావించారు ఓటర్లు. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటే కాదు.. తమ జీవితాల్ని ఉద్దరించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్న విసిగి వేసారిన ప్రజానీకపు ఆశ. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం అనేది పాత సామెత. అధికారంలో కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తే ఓటర్లు చూడరని అనుకోవద్దనేది ఈ ఎన్నికలు చెబుతున్న పాఠం. కొత్త ముఖ్యమంత్రి తమకెంతో చేస్తాడనీ.. తమకు ఎంతో మేలు జరుగుతుందనీ ఎదురుచూస్తున్న ప్రజానీకం ఆశగా.. జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. ఆ ఆశల్ని అడియాశలు కాకుండా చేయాల్సిన బాధ్యత యువనేత జగన్ దే!

Similar News