కేరళలో ఆగని హింసాకాండ

ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఘటనలపై కేరళ భగ్గుమంటూనే ఉంది. వరుసగా నాలుగో రోజూ రణరంగాన్ని తలపించింది.

Update: 2019-01-06 03:40 GMT

ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఘటనలపై కేరళ భగ్గుమంటూనే ఉంది. వరుసగా నాలుగో రోజూ రణరంగాన్ని తలపించింది. కేరళలో హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనలు కొనసాగాయి. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్న వివాదం రగులుతూనే ఉంది. కన్నౌర్‌ లో సీపీఎం, బీజేపీ నేతల ఇళ్ళపై దాడులు జరిగాయి. కన్నౌర్‌లో ఎమ్మెల్యే సంషీర్ ఇంటిపై కొందరు వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. అలాగే కన్నౌర్‌ జిల్లా సీపీఎం కార్యదర్శి పి. శశి ఇంటిపైనా బాంబు దాడులు చేశారు. పతానంమిట్ట జిల్లా అడోర్‌లో సీపీఎం కార్యకర్తల దుకాణాలపై బాంబు దాడులకు పాల్పడటంతో ఏడుగురికి గాయాలయ్యాయి

తలస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి. మురళీధరన్‌ నివాసంపై బాంబులు విసిరారు. ఆ సమయంలో ఎంపీ కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎంపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హానీ జరగలేదు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కోజికోడ్‌ జిల్లాలోనూ సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. కోజికోడ్‌ జిల్లాలో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న పెరంబ్ర, వడకర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కేరళలో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

మరోవైపు కేరళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. మోడీ ఈ నెల 6న పథనంథిట్టలో పర్యటించాల్సి ఉంది. అయితే కేరళలో హింసకు బీజేపీ, RSS , VHP కారణమని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ ఆలయం విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం శబరిమల విషయంలో కోర్టు తీర్పును వ్యతిరేకించడం విడ్డూరమని నారాయణ అన్నారు. అటు బిందు, కనకదుర్గ అయ్యప్ప దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన ప్రధాన పూజారి రాజీవరు కందరావ్‌ను ట్రావెన్‌కోర్‌ దేవస్థానం పాలకమండలి వివరణ కోరింది. 50 ఏళ్ళలోపు బిందు, కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించాక తలుపులు మూసేసి గర్భగుడిలో సంప్రోక్షణ ఎందుకు నిర్వహించారో వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ప్రధాన పూజారిని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం పాలక మండలి సంజాయిషీ అడిగింది

Similar News