రోజా మంత్రి పదవికి ఆ నేత నుంచే గట్టి పోటీ ?

Update: 2019-05-04 14:55 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూటికి నూరుశాతం అధికార పగ్గాలు చేపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఫలితాల్లో తామే అధికారం చేపట్టబోతున్నామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో బలంగా ఉన్నారు. అయితే ఇదిలాఉంటే ఒకవేళ నిజంగానే వైసీపీ పార్టీ ఏపీలో విజయకేతనం ఎగురవేస్తే మరి మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే దాని అప్పుడే జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీలో ఉంటూ టీడీపీపై పోరాటం చేసిన అనేకమంది నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో తమకే చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ జాబితాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉందని జగన్ కేబినెట్‌లో రోజాకు కీలక శాఖ లభిస్తుందనే కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.

అయితే వైసీపీ వర్గాల్లో మాత్రం రోజాకు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కేబినెట్‌లో దాదాపు బెర్త్ ఖాయమని జోరుగా అనుకుంటున్నారు. ఒకవేళ రామచంద్రరెడ్డి ఓడిపోతే తప్ప మంత్రి పదవికి వచ్చే డోకా ఏమీలేదని ఆయన అనుచరులు కూడా నమ్మకంగా ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి రెండో మంత్రి పదవి కోసం రోజాకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మధ్య మంచీ పోటీ ఎర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భాస్కర్ వర్గం భావిస్తోంది. మొత్తానికి ఏపీలో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే రోజాకు మంత్రి పదవి విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి మరి ఎవరికి మంత్రి పదవి లభిస్తోందోనని.

Similar News