దూకుడు పెంచిన పవన్‌ కల్యాణ్...నెలాఖరు నాటికి ఫైనల్ లిస్ట్ విడుదల

Update: 2019-02-13 10:32 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దూకుడు పెంచారు. మొన్నటిదాకా పక్క పార్టీలు అభ్యర్థులను ప్రకటించాక జనసేన అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తానన్న పవన్ ఇప్పుడు తన స్టాండ్ మార్చుకున్నారు. మరోవైపు తెలంగాణలో పార్లమెంటు కమిటీలు పూర్తి చేసిన పవన్ రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి రెడీ అయిపోయారు. ఇంతకీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు ఫైనల్ కాబోతుంది. ప్రజాపోరాట యాత్ర మళ్లీ ఎప్పుడు కాబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో గడిపిన పవన్ ఏపీలోనూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. వరుసగా పార్లమెంటు కమిటీలను పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో పోటీకి దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.

ఇదే వేగంతో పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సీనియర్లందరితో పవన్ భేటీ అయ్యారు. త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఐదుగురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఎటువంటి రిఫరెన్సు లేకుండా సేవా భావం కలిగి ఉన్న అభ్యర్థులకు, మంచి కుటుంబ నేపధ్యం, విద్యార్హత ,డబ్బుకు లొంగని గుణం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక చేయాలని పవన్ స్క్రీనింగ్ కమిటీకి సూచించారు.

అయితే, మొదటి దరఖాస్తును పవన్‌కల్యాణ్‌ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరంకు అందజేశారు. ఈ దరఖాస్తును అందుకున్న పవన్ తన వివరాలతోపాటు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వచ్చే దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేసి, నెలాఖరు నాటికి ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది.

మరోవైపు ప్రజాపోరాట యాత్రను చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప, కృష్ణాజిల్లాల్లోనూ చేపట్టేందుకు పవన్ రెడీ అవుతున్నారు. ఒక్కొక్క జిల్లాకి రెండు, మూడు బహిరంగ సభలు ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పవన్ తన పోరాట యాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

మొత్తంమీద పవన్ జగన్ మాదిరిగానే జనంలోకి దూసుకెళ్లి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే పనిలో పడ్డారు. అయితే, జనసేన తరఫున బరిలో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

Similar News