తెలంగాణలో మోగిన పంచాయతీ నగరా

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.

Update: 2019-01-01 12:48 GMT

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత ఈ నెల 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30న ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వివరించారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెంటనే తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు.

తొలి దశలో మొత్తం 4480 గ్రామ పంచాయతీల్లో, రెండో దశలో 4137 గ్రామపంచాయతీల్లో, మూడో దశలో 4115 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,13, 190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతాయని బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి స్పష్టంచేశారు.

Similar News