పోరుకు ముందే ఏకగ్రీవం...రాష్ట్రంలోనే ఏకగ్రీవం అయిన తొలి పంచాయతీగా రికార్డ్‌

పంచాయతీ పోరు ముంచుకొస్తున్న తరుణంలో అవసరమైన చోట్ల ఏకగ్రీవం చేసేందుకు పొలిటికల్‌ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆ దిశగా తొలి అడుగు వేసింది.

Update: 2019-01-04 04:19 GMT
Sarman Naik

పంచాయతీ పోరు ముంచుకొస్తున్న తరుణంలో అవసరమైన చోట్ల ఏకగ్రీవం చేసేందుకు పొలిటికల్‌ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సల్పబండ తండాకు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులను ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోనే ఏకగ్రీవం అయిన తొలి పంచాయతీగా రికార్డ్‌ సృష్టించింది.

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం ధర్పల్లి మండలంలోని సల్పబండ తండా. కొత్త పంచాయతీగా రూపుదిద్దుకున్న ఈ గిరిజన గ్రామం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పదవులను ఏకగ్రీవం చేస్తూ గిరిజనులు తీర్మానం చేశారు.

5 వందలకు పైగా ఉన్న జనాభా ఉన్న తండాలను ప్రభుత్వం గతేడాది పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గిరిజన తండా అయిన వడ్డెర కాలనీతో కలిసి సల్పబండ తండా కూడా పంచాయతీగా రూపుదిద్దుకుంది. ఈ గ్రామంలో మొత్తం 644 మంది జనాభా ఉండగా అందులో ఓటర్లు 295 మంది ఉన్నారు. ఓటు హక్కు ఉన్న వారంతా కలిసి ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించుకున్నారు. వారంతా కలిసి గతంలో అక్కడికి దగ్గర్లోని దుబ్బాక పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న సర్మన్‌ నాయక్‌ను తమ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దీంతో సల్పబండ తండా రాష్ట్రంలోనే ఏకగ్రీవం అయిన తొలి పంచాయతీగా రికార్డ్‌ సృష్టించింది. ప్రచారం పేరుతో డబ్బులను వృధా చేసుకోకుండా గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

Similar News