నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో..ముస్లిం ఓట్లపై ప్రధానపార్టీల గురి..

Update: 2019-03-25 15:44 GMT

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీలు ముస్లిం ఓట్లకు గురిపెట్టాయి. రాష్ట్ర మొత్తం ఓటర్లలో 4లక్షల వరకూ ఉన్న ముస్లిం ఓటర్లు 32 నియోజకవర్గాలలో నిర్ణయాత్మకపాత్ర ను పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు ముస్లిం ఓటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాయి.

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తొలి ఘట్టం నామినేషన్ల పర్వం పూర్తయ్యింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకోటానికి మాటలతూటాలు పేల్చుతూ దూసుకుపోతున్నారు.

మరోవైపురాష్ట్రజనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముస్లిం సామాజికవర్గ ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి రాజకీయపార్టీలు వరాలజల్లులు కురిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 84 లక్షల వరకూ ముస్లిం జనాభా ఉంటే 4 లక్షమందికి మాత్రమే ఓటు హక్కు ఉంది.

అయితే ఈ ఓటర్లంతా రాయలసీమలోని నాలుగు, కోస్తాంధ్రలోని మరో నాలుగు జిల్లాలో విస్తరించారు. అంతేకాదు...32 నియోజకవర్గాలలో జయాపజయాలను ప్రభావితం చేసే స్థితిలో ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ముస్లిం ఓటర్ల పైన సైతం దృష్టిని కేంద్రీకరించాయి. ముస్లిం ఓటర్లలో 58 శాతం పట్టణ ప్రాంతాలలో ఉంటే 27.3 శాతం గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు.2014 ఎన్నికల్లో బీజెపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు ఉండడంతో ముస్లిం ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అధికార టీడీపీ గత ఐదేళ్లుగా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నిధులతో పాటు పలు రకాల పథకాలను ప్రవేశపెట్టింది.

తొలిసారిగా ముస్లింలకు ప్రణాళిక ద్వారా 1,304 కోట్ల రూపాయలు కేటాయించింది. మరోవైపు వైసీపీ అధినేత సైతం ముస్లిం మైనార్టీల జీవితంలో నవరత్నాలతో వెలుగులు నింపుతామని హామి ఇస్తున్నారు. అంతేకాదు తమ పార్టీ నుంచి మొత్తం ఐదుగురు ముస్లిం మైనార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపారు. ఇక జనసేన పార్టీ మాత్రం సచార్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళిక ద్వారా ముస్లిం మైనార్టీలకు హామీ ఇచ్చింది.

రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు, కోస్తాంధ్రలోని మరో నాలుగు జిల్లాలలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకం కానున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న మొత్తం 32 నియోజక వర్గాలలో రాయలసీమలోని కర్నూలు రూరల్ , కడప, తూర్పు, నంద్యాల, నెల్లూరు నగరం, , రాయచోటి, హిందూపురం, కదిరి, మదనపల్లె, అనంతపురం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, ప్రొద్దుటూరు, ఆదోని, శ్రీశైలం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ఉన్నాయి.

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, మాచర్ల, గుంటూరు, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, రేపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంతో పాటు, కృష్ణాజిల్లాలోని విజయవాడ వెస్ట్ సైతం ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్ల కరుణ పైనే అభ్యర్థుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

Similar News