అభ్యర్థులకు ఎండల గుబులు...ఓటింగ్ శాతం తగ్గుతుందని టెన్షన్

Update: 2019-04-09 07:08 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలు అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎలాగోలా ప్రచారాన్ని గట్టేంకించిన నేతలకు ఇప్పుడు పోలింగ్ శాతంపై టెన్షన్ మొదలైంది. ఎండల భగ భగలు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఇన్నిరోజులు ప్రచారాన్ని హోరెత్తించిన నేతలు ఇప్పుడు పోలింగ్ శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. ఓటింగ్ శాతం పెంచుకుని విజయానికి బాటు వేసుకోవాలని భావిస్తున్న వారికి ఎండలు అడ్డుకట్ట వేస్తున్నాయి. మండుతున్న ఎండలకు బెంబెలెత్తిన అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళలకే ప్రచారం పరిమితం చేశారు. అభ్యర్థుల ప్రచారానికి ఎండలు అవరోధంగా మారగా మరోవైపు పోలింగ్ శాతంపై ప్రభావం చూపనుంది.

ఎండలకు భయపడి ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా మొగ్గు చూపకపోవచ్చు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం తగ్గిపోతే తమ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు భయపడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎన్నికలు జరిగే 11న 43.3 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం సకల ఏర్పాట్లు చేస్తుంది. అయినా ఓటర్లు ఓటు వేసేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Similar News