ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలదే హవా

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇక మహిళల హవా కొనసాగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కావడంతో పోటీకి సిద్ధమయ్యారు నారీమణులు.

Update: 2019-01-21 05:42 GMT

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇక మహిళల హవా కొనసాగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కావడంతో పోటీకి సిద్ధమయ్యారు నారీమణులు. మరోవైపు జనరల్ స్థానాల్లోనూ పోటీపడుతుండటంతో అధిక శాతం మహిళలదే పై చేయి అవుతోంది. ఉమ్మడి జిల్లాల్లో 1684 స్థానాలకు గాను రిజర్వేషన్లు ఉన్న 832 స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో కూడా బరిలో దిగుతున్నారు మహిళలు.

గ్రామ పోరులో ఈ సారి మహిళలదే హవా అత్యధిక స్థానాల్లో మహిళలే సర్పంచ్‌లుగా ఉండబోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1684 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంటే అందులో 832 స్థానాల్లో మహిళలే సర్పంచ్‌లుగా బరిలో దిగారు. ఈ స్థానాలే కాకుండా జనరల్ కేటగిరికి కేటాయించిన స్థానాల్లోనూ మహిళలు పోటీకి దిగారు.

జిల్లాల విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 26 మండలాలుంటే 721 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 359 గ్రామాల్లో మహిళలకు రిజర్వేషన్ అయ్యింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళలకు పెద్దపీట వేయగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరిలో 50శాతం స్థానాలను ప్రభుత్వం మహిళలకు కేటాయించింది. అదీగాక జనరల్ స్థానాల్లోనూ పురుషులపై పోటీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో మహిళలు గ్రామ పోరుకు సై అంటున్నారు.

ఇక కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో మొత్తం 255 పంచాయతీలుంటే అందులో 125 స్థానాలు మహిళలకు కేటాయించారు. అటు నాగర్ ‌కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలుంటే 223 స్థానాలను మహిళలకు కేటాయించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున పోటీకి రెడీ అయ్యారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీల్లో 125 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యింది. ఈ సారి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో మహిళలదే హవా కనిపిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో 181 గ్రామ పంచాయతీలకు గాను 93 పంచాయతీల్లో మహిళలకు రిజర్వు అయ్యింది. దీంతో అక్కడ అత్యధిక స్థానాల్లో మహిళలు సర్పంచ్‌లుగా కొలువుదీరబోతున్నారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ పీటం మహిళలకే దక్కనుంది.  

Similar News