యుద్ధం ప్రచారంపై సేనాని వివరణ

Update: 2019-03-02 06:29 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోనే చర్చనీయాంశం కావడమే కాదు పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రికలో కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసునని జనసేనాని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే, దీనిపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఇండియన్ మీడియాకు సూచించారు. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తానెవరితో చెప్పలేదన్నారు. రాజకీయ విశ్లేషకులు, కొన్ని న్యూస్ ఛానల్స్‌ చెప్పిన జోస్యాన్ని తాను ఉదహరించానన్నారు. నాకు తెలుసని చెప్పలేదన్నారు పవన్. తన వ్యాఖ్యల్లో బీజేపీ మాట ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

అంతేకాదు, పవన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, చెబుతూ ఆయన రెండు సందర్భాలలో మాట్లాడిన వీడియోను జనసేన పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నందున జనసేన వరుస ట్వీట్లు చేసింది. ఓ ట్వీట్‌లో 'చాలా మందికి తెలుసు ఇది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుంది అనేది నా అంచనా కాదు. పొలిటికల్ విశ్లేషకుల అంచనా, ఫైనాన్సియల్ టైమ్స్ లాంటివి చదవండి' అని పవన్ పేర్కొన్నట్లుగా ఉంది.

రెండోదాంట్లో ...'ఈ రోజున సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం జరుగుతాంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు రెండు సంవత్సరాల క్రితం చెప్పారు ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు.' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఫిబ్రవరి 26, 2019న పవన్ కళ్యాణ్ అన్నట్లు జనసేన పేర్కొంది.

Similar News