బస్సుయాత్రకు సిద్ధమవుతున్న జగన్‌

Update: 2019-03-06 05:10 GMT

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ మరో యాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లిన ఆయన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత బస్‌ యాత్ర చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రూట్‌ మ్యాప్‌ కూడా రెడీ చేసుకుంటున్న జగన్‌ త్వరలోనే బస్‌ ఎక్కేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో ఎన్నికల హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని పొలిటికల్‌ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన జగన్ రెండో దఫాలో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లలేకపోయిన జగన్‌ ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో బస్‌ యాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే ఈ బస్‌ యాత్ర మొదలయ్యేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన జగన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రెండు మూడు రోజుల్లో ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బస్సెక్కాలని నిర్ణయించుకున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల 12 లేదా 14 తేదీల్లో బ‌స్ యాత్ర ప్రారంభ‌మ‌య్యే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాద‌యాత్ర ద్వారా మొత్తం 134 నియోజ‌క‌ర్గాల‌ను క‌వ‌ర్ చేసిన జ‌గ‌న్ మిగిలిన 41 నియోజ‌క‌ర్గాల్లో ఈ బస్‌యాత్ర చేపడతారు. అయితే ఇదే యాత్రలో అవకాశాన్ని బట్టి రాష్ట్రంలో ముఖ్యమైన నియోజకవర్గాలను కూడా చుట్టుముట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఈ యాత్రకు సమర శంఖారావ యాత్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News