తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు

Update: 2019-08-03 15:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుండటంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.. గోదావరి, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ప్రాజుక్టుల్లో జలకల సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.. నాగార్జునా సాగర్‌ ప్రాజెక్టు కూడా నీటితో నిండిపోయింది.. శ్రీశైలం రిజర్వాయర్ నీటితో కళకళ లాడుతోంది..

గోదావరి కూడా ఉద్ధృత రూపు దాల్చింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో వర్షాలు భారీ వర్షాలు దంచికొడుతుండటంతో.. తెలంగాణకు గోదారి తల్లి పరుగులిడుతూ వస్తోంది. కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వీటితో పాటు తెలంగాణలోని వాగులు వంకలు నీటితో కళకళ లాడుతున్నాయి..

ఒకవైపు తెలంగాణలో ప్రాజెక్టులు జలకల సంతరించుకుంటే.. ఏపీలోని లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యారు, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పి.గన్నవరం మండలం చాలకలి పాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. నాలుగు రోజులుగా కరకాయ లంక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బూరుగు లంక, హరిగెలవారిపేట, జి.పెదపూడి లంక, అయోధ్య లంక, అనగారిలంక వాసులు మరబోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో లంకగ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News