అన్నదాతలపై పగబట్టిన ప్రకృతి...

Update: 2019-04-27 04:23 GMT

అన్నదాతలపై ప్రకృతి పగబడుతోంది. అసలే గిట్టుబాటు ధరలేక అల్లాడుతోన్న రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీయగా ఇప్పుడు తుపాను భయపెడుతోంది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేస్తుండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు పంటలను కాపాడుకోలేక మరోవైపు ధాన్యాన్ని నిల్వ చేసుకోలేక రైతన్నలు సతమతమవుతున్నారు.

ఒకవైపు ప్రకృతి మరోవైపు వ్యాపారులు ఇంకోవైపు అధికారులు ఇలా అన్నదాతలపై ముప్పేట దాడి జరుగుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో రైతన్నపై ప్రకృతి పగబడుతోంది. దాల్వా సీజన్‌‌లో మంచి దిగుబడి వచ్చిందని ఆనందపడుతున్నంతలోపే, అకాల వర్షాలు రైతన్నల ఆనందాన్ని ఆవిరి చేయగా, ఇప్పుడు ఆంధ్రా మీదుగా దూసుకొస్తున్న తుపాను అన్నదాతలను భయపెడుతోంది. ఒకవైపు ప్రకృతి భయపెడుతుంటే మరోవైపు అకాల వర్షాలు, తుపానును బూచిగా చూపుతూ రైతుల నడ్డివిరుస్తున్నారు వ్యాపారులు. ధాన్యానికి ప్రస్తుతం 1300 రూపాయలకు పైగా గిట్టుబాటు ధర ఉండగా, తుపాను పేరుతో 11వందలకే కొనుగోలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే నిల్వ చేసుకునే సామర్ధ్యం లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు.

అయితే రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలుకు 300 కేంద్రాలు ఏర్పాటు చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అందులో వాస్తవం లేదని అన్నదాతలు వాపోతున్నారు. 70శాతానికి పైగా కోతలు పూర్తయినా, సరిపడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో మామిడి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, జీడిమామిడి రైతులు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఒకవేళ ఫణి తుపాను విరుచుకుపడితే కోలుకోవడం కష్టమని భయపడుతున్నారు.

Similar News