పటిష్ఠ భద్రత మధ్య ఈవీఎంలు తరలింపు

Update: 2019-04-12 07:24 GMT

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఏపీలో 75 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు జిల్లాల్లోని స్ట్రాంగ్ రూములకు చేరాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చారు. స్ట్రాంగ్ రూముల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి. రెండో అంచెలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా కాస్తాయి. ఇక మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ రాష్ట్ర పోలీసులు పహారా కాస్తున్నారు.

ఎన్నికల కౌంటింగ్ వచ్చే నెల 23న జరగనుండడం దానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈవీఎంల తారుమారు చేయవచ్చన్న అనుమానాలు ఉండటం, ట్యాంపరింగ్ ఆరోపణలు కూడా విపరీతంగా ఉండడంతో స్ట్రాంగ్‌ రూంల దగ్గర కార్యకర్తలను కాపలాగా ఉంచాలని నిర్ణయించాయి. రాబోయే 40 రోజుల పాటు స్ట్రాంగ్‌ రూంల దగ్గర షిఫ్టుల వారీగా కాపలా కాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. వైసీపీ కూడా తమ కార్యకర్తలను ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉంచాలని డిసైడ్ అయ్యింది. మొత్తం 40 రోజుల పాటు పటిష్ట భద్రత మధ్య ఉంచిన ఈవీఎంలను వచ్చే నెల 23న తెరిచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. 

Full View

Similar News