మొరాయించిన ఈవీఎంలు.. అల్లాడిపోయిన ఓటర్లు

Update: 2019-04-11 12:44 GMT

ఈవీఎంలు మొరాయింపుతో ఏపీలోని ఓటర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు. చాలాచోట్ల ఈవీఎంల సమస్యతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటల వరకు కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో సాంకేతి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్దీ క్యూ లైన్ లోనే ఉండాల్సి వచ్చింది. ఏపీలో పలు చోట్ల ఈవీఎంలు ఓటర్లకు చుక్కలు చూపించాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంలు మెరాయించడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల సమస్య తలెత్తడంతో అధికారులు, ఓటర్లను తీవ్ర ఇబ్బందిపడ్డారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సాంకేతిక లోపాల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటలకొద్ది క్యూ లైన్ లోనే నిలబడాల్సి వచ్చింది.

ఈవీఎంలు మెరాయించడంతో ఏపీలోని చాలా కేంద్రాల్లో పోలింగ్‌ ఆలస్యంగా మొదలయ్యింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనా.. సాంకేతిక లోపాల కారణంగా చాలాసేపు ఆ ప్రాంతాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 9 గంటల వరకు కూడా ఈవీఎంలు పని చేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో 10 గంటల తర్వాతే ఈవీఎంల సమస్యలు పరిష్కరించబడ్డాయి. తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట మున్సిపల్ హైస్కూల్లో ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెళ్లారు. అదే సమయంలో అక్కడి వీవీ ప్యాట్‌ మొరాయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఈవీఎంలు మొరాయించాయని వాటిని టెక్నీకల్ టీం రిపేర్ చేశారని తెలిపారు. సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయాయని, వాటిని ఇంజినీర్లు సరిచేశారని ద్వివేది చెప్పారు.

బనగానపల్లె నియోజకవర్గంలోని వల్లంపాడు, శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస, లంకాపట్నంలో ఈవీఎంలు మొరాయించాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు హౌసింగ్ బోర్డ్, పులపల్లి, చింతపర్రులోనూ సాంకేతిక సమస్యతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లిలో 172, 173 పోలింగ్ బూత్‌లలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీకి ఓటేస్తే, వైసీపీకి వెళుతున్నాయని స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఆయా కేంద్రాల్లో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించారు. విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో సైకిల్‌కు ఓటేస్తే బీజేపీకి పడుతుడడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు ఆ కేంద్రంలో కొద్దిసేపు పోలింగ్‌ నిలిపివేశారు.

చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక పోవటంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈవీఎంల వల్ల నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. మరోవైపు, ఈవీఎంలు మొరాయించడంపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 157 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, ఆయా చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని కోరారు. అయితే, పోలింగ్ ఆలస్యంగా మొదలైన చోట పోలింగ్‌ సమయాన్ని పొడిగించేందుకు ఈసీ నిరాకరించింది. 

Similar News