అప్పుడు ఓటమి ఇప్పుడు వరమైంది!

Update: 2019-05-30 12:48 GMT

అంతా మన మంచికే అంటారు..ఇది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డి కి సరిగ్గా సరిపోతుంది. కొద్దీ నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అయన ఓటమి చవి చూసారు. అయితే, ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెరాస అభ్యర్థిపై 62,144 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన కేంద్ర మంత్రివర్గం లో స్థానం సంపాదించుకోగలిగారు. 

సుదీర్ఘ రాజకీయ  ప్రస్థానం.. 

కిషన్ రెడ్డి 1977 లో అప్పటి జనతా పార్టీ లో సామాన్య కార్యకర్త గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో బీజేపీ లో చేరిన ఆయన 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా, 1986 నుంచి 90 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు  బీజేవైఎం అధ్యక్షుడిగా  పనిచేశారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిలభారత కార్యదర్శిగా, 1992 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయిలో చురుగ్గా వ్యవహరించారు. 2001 నుంచి 2002 వరకు భాజపా రాష్ట్ర కోశాధికారిగా, 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, 2003 నుంచి 2005 వరకు భాజపా రాష్ట్ర అధికారప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ఎమ్మెల్యేగా..

2004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి కిషన్ రెడ్డి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.


Similar News