ఏపీ సీఎం జగన్‌కి కన్నా లక్ష్మీనారాయణ సలహా

Update: 2019-06-07 10:31 GMT

ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి పర్యటన సందర్భంగా కన్నా మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కన్నా లక్ష్మీనారాయణ ఓ సలహా ఇచ్చారు. విభజన హామీ మేరకు ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా డిమాండ్ మాత్రం మరిచిపోవాలని కోరారు. ఈ ఒక్కటి మినహా ఏది అడిగినా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారని చెప్పారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా మినహా ఇతర డిమాండ్లను సాధించుకోవాలని జగన్‌కు కన్నా సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి మోడీని కలిసినా ఎలాంటి లాభం ఉండదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని అయినా జగన్ మోడీని అడిగితే అభ్యంతరం లేదన్నారు.

ఇక మరోవైపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9న తిరుమల రానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని హోదాలో రెండోసారి స్వామివారిని దర్శించుకోనున్నారు. 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ప్రదాని మోడీ తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. పద్మావతి అతిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు తిరుమల శ్రీవానిరి దర్శించుకుంటారు. షెడ్యూల్ ప్రకారం గంటా 15 నిమిషాల పాటు ఆలయంలో గడపనున్నారు. స్వామివారి దర్శన అనంతరం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. 

Tags:    

Similar News