మహిళా ఓటర్ల దయాదాక్షిణ్యాల పైనే అధికారం

Update: 2019-03-29 16:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓవైపు మూడుపక్షాలు భీకర పోరు జరుపుతుంటే మరోవైపు రాజకీయ నేతల భవతవ్యాన్ని నిర్ణయించడానికి మహిళలు సిద్ధమవుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటంతో రాజకీయపార్టీల నేతలంతా ఆడపడుచులు, పసుపుకంకాలూ అంటూ సెంటిమెంట్ తో ఆకట్టుకోడానికి తంటాలు పడుతున్నారు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగే టీ-20 క్రికెట్ మ్యాచ్ తరహాలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం జరుగుతోంది. మూడుపార్టీల ముక్కోణపు పోరులో ప్రతిఓటూ కీలకమే. అంతేకాదు పోలింగ్ బూత్ కు శ్రద్ధగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోడంలో మహిళల తర్వాతే ఎవరైనా.

మహిళా ఓటర్ల అభిమానం చూరగొన్న పార్టీలే విజేతగా నిలవడం, అధికారం దక్కించుకోడం మనం చూస్తున్నదే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం మహిళల ఓట్లే అధికారాన్ని నిర్ణయించడంలో కీలకం కాబోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళల దయాదాక్షిణ్యాల పైనే ఏపీ పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో...138 చోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం చూస్తే మహిళా ఓటర్ల ఓట్లు ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు.

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రకారం...రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది ఉంటే మహిళా ఓటర్లు కోటీ 98 లక్షల ,79 వేల 421 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే 4 లక్షల 17 వేల 82 మంది ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 138 అసెంబ్లీ స్థానాలలో మహిళా ఓటర్లు నిర్ణాయకపాత్రను పోషించబోతున్నారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో పురుషుల కంటే మహిళా ఓటర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. దీంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేనపార్టీలు మహిళా ఓటర్లను ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు, పసుపుకుంకాలు అంటూ ఆ కట్టుకోడానికి నానాపాట్లు పడుతున్నారు. అంతేకాదు తమ ఎన్నికల ప్రణాళికలో మహిళలకే అధికప్రాధ్యాన్యమిస్తున్నట్లు ప్రకటించి మరీ ఊదరగొడుతున్నాయి. గుంభనంగా తమపనిని తాము చేసుకుపోయే మహిళామతల్లులు తమ ఓట్ల వర్షాన్ని ఏపార్టీపై కురిపిస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మహిళా ఓటర్లు ఎవరికి జైకొడతారో వారికే అధికారం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Similar News