ఇనిమెట్ల గొడవపై బాబుకు కోడెల వివరణ.. వీడియో ఫుటేజ్‌ బయటపెట్టాలి: కోడెల

Update: 2019-04-17 15:51 GMT

సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ రోజున చెలరేగిన వివాదం ఇంకా చల్లారలేదు. ఇనిమెట్లలో పోలింగ్ బూత్‌‌లో జరిగిన వివరాలను కోడెల చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా కోడెలపై ఏపీ ఎన్నికల సంఘం సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని స్పీకర్ కోడెల అంటుంటే కోడెల రౌడీలతో రిగ్గింగ్‌కి యత్నిస్తే ప్రజలే తిరుగుబాటు చేశారని వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటింగ్ రోజున జరిగిన ఘటనపై టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఆరోపణ ప్రత్యారోపణల యుద్ధం ఇది. ఇనిమెట్లలో జరిగిన గొడవపై గవర్నర్‌‌తో పాటు పోలీసులకు వైసీపీ ఫిర్యాదు చేయడం ఆయనపై కేసు నమోదు కావడంతో సత్తెనపల్లిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. పోలింగ్ రోజున ఇనిమెట్ల గ్రామంలో జరిగిన ఘటన గురించి వివరించడానికి కోడెల సీఎం చంద్రబాబును కలిశారు. గొడవ తర్వాత జరిగిన పరిణామాలను అధినేతకు వివరించారు. కేసులు పెట్టినా భయపడేది లేదని చంద్రబాబుతో భేటీ తర్వాత కోడెల అన్నారు. గొడవలు చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర తగిన బలగాలు పంపలేదని ఆరోపించారు. కేంద్రం, ఈసీ ఏకపక్షంగా వ్యవహరించాయన్న కోడెల ఇనిమెట్ల పోలింగ్ బూత్‌లో ఏం జరిగిందో తెలియాలంటే వీడియో ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఇనిమెట్లలో జరిగిన గొడవకు కోడెల శివ ప్రసాద్ కారణమంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. కోడెలపై అసలైన దాడి ఫలితాలు వచ్చే రోజున ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నారు. పోలింగ్ పూర్తయ్యి వారం రోజులైనా ఇనిమెట్లలో జరిగిన ఘటన మాత్రం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. 

Similar News